Telugu Gateway
Cinema

‘వెంకీమామ’ మూవీ రివ్యూ

‘వెంకీమామ’ మూవీ రివ్యూ
X

వెంకటేష్ ఎఫ్2 సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అక్కినేని నాగచైతన్య కు ‘మజిలీ’ కూడా మంచి హిట్ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ‘వెంకీమామ’. రియల్ లైఫ్ లోనూ మామా, అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగచైతన్యలు రీల్ లైఫ్ లోనూ ఇదే తరహా పాత్రలు చేశారు. వెంకటేష్, నాగచైతన్యల సినిమా కావటంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఓ గ్రామంలో వెంకటేష్ తండ్రి నాజర్ అందరికీ జాతకాలు చూస్తూ మంచి ముహుర్తాలు పెడుతుంటారు. ఎంత డబ్బున్న వాళ్ళు అయినా నాజర్ పెట్టే ముహుర్తాలపై నమ్మకంతో గుడిలో పెళ్లి చేసుకుంటారు. కానీ నాజర్ కూతురు మాత్రం అందుకు భిన్నంగా జాతకాలు కలవకపోయినా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో నాజర్ చెప్పినట్లుగానే వాళ్ళిద్దరూ ఓ కారు ప్రమాదంలో చనిపోతారు. చివరకు మేనల్లుడిని కూడా వాళ్ళ నాయనమ్మ, తాతయ్యల ఇంటికే పంపాలని నాజర్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ వెంకటేష్ తన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించి మేనల్లుడిని తన ఇంట్లోనే పెంచుతాడు.

అన్నీ తానై చూస్తాడు. మేనల్లుడు ఇంట్లో ఉంటే తన కొడుకు ప్రాణాలకు ముప్పు అని ఎలాగైనా నాగచైతన్యను బయటకు పంపాలని చూస్తాడు నాజర్. తనకు వచ్చే భార్య తనతో పాటు ఉండే మేనల్లుడిని చూసుకోవటానికి ఇష్టపడటం లేదని పెళ్ళి కూడా చేసుకోడు వెంకటేష్. చివరకు తన కల అయిన ఆర్మీ ఉద్యోగానికి కూడా దూరంగా ఉంటాడు. మరి ఈ జాతకాల నమ్మకాలు నిజం అయ్యాయా?. మేనల్లుడి కారణంగా మామకు ప్రాణగండం ఏర్పడిందా? లేదా అన్నదే సినిమా. సినిమా ఫస్టాఫ్ అంతా జాతకాలపై నమ్మకాలు..దాన్ని వ్యతిరేకించే కొడుకు, మేనల్లుడి అంశాలపై నడిచిపోతుంది సెకండాఫ్ లో మాత్రం జమ్మూ కాశ్మీర్ లో పేరుగాంచిన టెర్రిరిస్ట్ ను పట్టుకొచ్చే ఆర్మీ అధికారిగా నాగచైతన్య చేసే సీన్లు, తనకు చెప్పకుండా మూడేళ్ళ పాటు ఆర్మీలో పనిచేస్తున్న అల్లుడిని కలుసుకునేందుకు వెళ్ళిన వెంకటేష్ వెళ్లిన సన్నివేశాలతో సాగుతుంది.

హీరోయిన్ రాశీ ఖన్నా, పాయల్ పాజ్ పుత్ ల పాత్రలు కేవలం నామమాత్రమే. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా ఉండదు. ‘ఐదు వేల రూపాయలు ఇస్తే మనకు ఐదు సంవత్సరాల పదవి ఇస్తారు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు. కల నెరవర్చేందుకు కొంత కాలం కళ్ళ ముందు కన్పించకపోయినా పర్లేదు’ వంటి కొన్ని డైలాగ్ లు ఆకట్టుకుంటాయి. వెంకటేష్, నాగచైతన్యలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినా కథలో కొత్తదనం లేకపోవటంతో సినిమా సో సో గా సాగుతుంది. సినిమా ప్రారంభంలో మేనల్లుడు చిన్నగా ఉన్నప్పుడు, మామ వెంకటేష్ ను చూసి స్పందించే సీన్లు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు బాబీ కొల్లి సినిమాను ఆసక్తికరంగా మలచటంలో విఫలమయ్యారు. దీంతో ‘వెంకీమామ’ ఓ రొటీన్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it