Telugu Gateway
Politics

హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సీపీపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉత్తమ్ ఎవరిపైనా ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. అంజనీకుమార్ ఐపీఏస్ అనే హోదాను తీసేసి..కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ (కెపీఎస్) అని పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. సీపీ అవినీతిపరుడని..అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని ఆరోపించారు. అంజనీకుమార్ అసలు ఐపీఏస్ పోస్టుకు ఏ మాత్రం అర్హుడు కాదంటూ ఆయనపై గవర్నర్ కు సోమవారం నాడు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ లో శాంతి, భద్రతల వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని..అందుకే తాము ఆమెకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. పోలీసు అధికారులు తమ పరిధిలో వ్యవహరించాలని ఓవరాక్షన్ చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు.

ఓవరాక్షన్ చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నేలేదన్నారు. గాంధీభవన్ లో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కవాతుకు సీపీ అంజనీకుమార్ అనుమతించారు.కాంగ్రెస్ ర్యాలీకి మాత్రం నో చెప్పారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏ రూట్ లో అయినా వెళతామని చెప్పినా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రం అనుమతి నిరాకరించారని తెలిపారు. ఇదెక్కడి పద్దతి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా తాము కార్యక్రమాలు తలపెట్టామన్నారు. గాంధీ భవన్ చుట్టూ పోలీసులు మొహరించాల్సిన అవసరం ఏముందని..వీరంతా ఇక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Next Story
Share it