Telugu Gateway
Politics

అసెంబ్లీ ఎదుట మాజీ సీఎం ధర్నా

అసెంబ్లీ ఎదుట మాజీ సీఎం ధర్నా
X

దేశాన్ని ప్రస్తుతం రేప్ ఘటనల వ్యవహారం కుదిపేస్తుంది. హైదరాబాద్ లో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయటంతో ఒక్కసారిగా అందరిలో కదలిక వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం ఇదే తరహా డిమాండ్లు కూడా బయలుదేరాయి. ఒక్కో కేసులో ఒక్కో న్యాయమా అంటూ బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ని ఉన్నావ్ ఘటనపై ఆ రాష్ట్రం అట్టుడుకిపోతోంది. నిందితులు కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేశారు. మరోవైపు మాజీ సీఎం అఖిలేష్ ఆధ్వర్యంలో సమాజ్‌వాది పార్టీ నేతలు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. అసెంబ్లీ గేటు వద్ద అఖిలేష్ బైఠాయించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఉన్నావ్ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితురాలి మృతికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం పేర్కొన్నారు.

Next Story
Share it