అప్పుడు చంద్రబాబు వీడియోలు..ఇప్పుడు జగన్ వీడియోలు
ఏపీకి ముఖ్యమంత్రులు మారారు. అంతా సేమ్ టూ సేమ్. అప్పుడు అందరూ చంద్రబాబు వీడియోలు చూసేవారు. ఇప్పుడు సీఎం జగన్ వీడియోలు చూస్తున్నారు. అంతే తేడా. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు మార్లు మాట మార్చారు. ప్రతిపక్ష వైసీపీ అప్పట్లో ఈ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసింది. రాజకీయంగా ఇది చంద్రబాబుకు భారీ నష్టమే చేసింది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల విషయంలో చంద్రబాబు లెక్కలేనన్ని సార్లు మాట మార్చి రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించలేదని పలుమార్లు విమర్శించారు. ఎన్నికల ముందు కూడా ఇది ఓ ప్రధాన అంశంగా మారింది. అమరావతి విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఏపీ ప్రజలు ఆశించిన మేర ప్రగతి చూపించటంలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారు. ఆ ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది.
ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ముగిసిన అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇది పెద్ద కలకలమే రేపుతోంది. అంతే కాదు గతంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్ అమరావతి రాజధానిని స్వాగతిస్తూ అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమరావతి కి ఓకే చెప్పటమే కాదు..ఏకంగా 30 వేల ఎకరాలు ఉన్న చోటే రాజధాని కట్టాలంటూ జగన్ స్పష్టంగా ప్రకటన చేశారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రులు కూడా అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు ఎన్నికలకు ముందు జరిగిన వైసీపీ ప్లీనరీలో కూడా జగన్ అమరావతికి అనుకూలంగా ప్రకటన చేశారు. రాజధాని విషయంలో ముందు చంద్రబాబు ఎలా అయితే ఏకపక్షంగా వ్యవహరించారో..ఇప్పుడు జగన్ కూడా అంతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు అన్నీ తానై కనీసం అఖిలపక్షం దృష్టికి కూడా అత్యంత కీలకమైన రాజధాని అంశాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు జగన్ కూడా అంతే. ఏకంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు.
https://www.youtube.com/watch?v=nwXYsR_t0Jw