Telugu Gateway
Politics

ట్రంప్ కు అభిశంసన షాక్

ట్రంప్ కు  అభిశంసన షాక్
X

ప్రచారమే నిజం అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తగిలింది. ఆయన్ను ఏకంగా ప్రతినిధుల సభ అభిశంసించినా పదవికి మాత్రం ఢోకాలేదు. కాకపోతే పరువు పోతుంది. అయితే ఈ అంశాన్ని ప్రస్తుతం ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు కదా?. అమెరికా అయినా ఇందుకు పెద్ద మినహాయింపు ఏమీ కాదు. అందుకే ట్రంప్ ఈ అభిశంసనతో పెద్ద ఖంగారేమీ పడటం లేదు. కాకపోతే ఇలా అభిశంసనకు గురైన మూడవ అమెరికా అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. తదుపరి ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ నాయకుడు జోయ్‌ బైడన్‌ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్‌ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బైడన్‌ కుమారుడు హంటర్‌ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి.

ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్‌... దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని... బైడన్‌, ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తూ అభిశంసనకు పట్టుబట్టారు. అయితే ట్రంప్‌ మాత్రం వీటిని కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆడం చిఫ్‌ నేతృత్వంలో అభిశంసన విచారణ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి బుధవారం ఆమోదించింది. దీంతో ట్రంప్‌ అభిశంసనకు గురైనట్లు స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఇక సెనేట్‌లో జనవరి నుంచి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. అయితే సెనేట్‌లో అధికార రిపబ్లికన‍్ల ఆధిపత్యం ఉన్నందు వల్ల ట్రంప్‌ అభిశంసన వీగిపోయే అవకాశం ఉంది. అయితే అధ్యక్షుడిని అభిశంసించి గద్దె దింపడం సులభమేమీ కాదు.

Next Story
Share it