Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
X

ఏపీలో గృహ నిర్మాణానికి సంబంధించిన అంశంపై ఏపీ అసెంబ్లీలో వాదోపవాదాలు జరిగాయి. గత ప్రభుత్వం భారీ ఎత్తున గృహ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడటంతోపాటు..పంచభూతాలను దోచుకుందని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోని ఇళ్ల నిర్మాణంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లుకూడా లబ్దిదారుడికి ఇవ్వలేదని మంత్రి బొత్స తెలిపారు. సభలో టీడీపీ అవాస్తవాలు చెబుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆదరాబాదరాగా ఇళ్లు కట్టించిందని విమర్శించారు. లబ్దిదారులను తొలగించామన్న మాటల్లో నిజం లేదని అన్నారు. ఆధునిక పరిఙ్ఞానంతో ఇళ్లను నిర్మించి లబ్దిదారులకు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

గృహ నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌పై ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం చెప్తుండగా..తమకు మాట్లాడే అవకాశం కావాలంటూ టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లారు. వారిని స్పీకర్‌ అనుమతించకపోవడంతో వాకౌట్‌ చేశారు. తమ హయాంలో మంత్రి అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని..నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధమే అని టీడీపీ ఛాలెంజ్ చేసింది. అదే సమయంలో సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ సభ్యులు ‘రివర్స్’ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండర్లు అమలు చేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయల అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వాల్లో జరిగిన ఇళ్ళ నిర్మాణానికి, టీడీపీ హయాంలో సాగిన వాటి మధ్య తేడా పరిశీలించేందుకు హౌస్ కమిటీ వేయాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Next Story
Share it