జగన్ పై టీడీపీపై ప్రివిలైజ్ నోటీసు
ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ సభ్యులు సభా ప్రాంగణంలోకి రాకుండా మార్షల్స్ అడ్డుకున్న తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా..అధికార వైసీపీ మాత్రం చంద్రబాబునాయుడితోపాటు టీడీపీ సభ్యులు మార్షల్స్ ను దుర్భాషలాడారని ఆరోపించింది. ఈ మేరకు ఓ వీడియోను కూడా సభలో ప్రదర్శించింది. ఆ తర్వాత సీఎం జగన్ సభలో మాట్లాడుతూ చంద్రబాబు ‘బాస్టర్డ్’ అని తిట్టారని ఆరోపించారు. ఇది ఎంత దారుణమైన పదం..అధికారులను ఇలా తిట్టవచ్చా అని ప్రశ్నించారు. టీడీపీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు కలిశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా సీఎం జగన్ వక్రీకరించారంటూ సీఎంపై ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు.
అసెంబ్లీలోకి వస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబును, టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు నిలదీశారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అసెంబ్లీలో అధికార పక్షం శుక్రవారం ప్రదర్శించింది. చీఫ్ మార్షల్స్ ను చంద్రబాబు ‘బాస్టర్డ్’ అని దుర్భాషలాడారని సీఎం జగన్ ఆరోపించారు. ‘నో క్వశ్చన్’ పదాన్ని బాస్టెడ్‌గా చిత్రీకరించారని చంద్రబాబు చెప్పారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారని విమర్శించారు. తన నోటి నుంచి ఎప్పుడు బూతులు రావని, ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని ఆయన చెప్పారు.