ఏపీ గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడి అంశంపై టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఉన్న బస్సుపై చెప్పులు, రాళ్ళు వేశారన్నారు. పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవటం వల్లనే ఇది జరిగిందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలసి ఈ బృందంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు గద్దె రామ్మోహన్, మద్దాల గిరి, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.
గవర్నర్ తో భేటీ అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్ స్పందన సంతృప్తికరంగా ఉందని తెలిపారు. బస్సుపై పడ్డ పోలీసు లాఠీ ఎవరిదో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును ఇష్టానుసారం బూతులు తిట్టిన కొడాలి నానిని వదిలేసిన..ఆయన తిట్లపై స్పందించిన మహిళను అరెస్ట్ చేయటం ఎంత వరకూ న్యాయం అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.