Telugu Gateway
Andhra Pradesh

సాక్షి పేపర్లో తప్పు రాశారు..మిగతా పేపర్లు చూడండి

సాక్షి పేపర్లో తప్పు రాశారు..మిగతా పేపర్లు చూడండి
X

సన్నబియ్యం వ్యవహారం మంగళవారం నాడు అసెంబ్లీలో దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సన్నిబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారని..సభలో అనుమతిస్తే దీనికి సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తామని అన్నారు. సాక్షి పేపర్లో కూడా సన్నబియ్యం గురించి రాశారని చెప్పారు. కానీ మంత్రి మాత్రం తాము సన్నబియ్యం అని ఎక్కడా చెప్పలేదని చెబుతున్నారని..మాట ఇస్తే తప్పం..మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ ఈ విషయంలో ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. ఈ అంశంలో జోక్యం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి సాక్షి సన్నబియ్యం తప్పు రాశారని..అదే రోజు మిగిలిన పత్రికలు చూడాలని సూచించారు. అసలు వైసీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పని పనులను కూడా ప్రభుత్వం చేస్తోందని గుర్తుచేశారు. మంగళవారం అసెంబ్లీలో బియ్యం సరఫరాపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. తొలుత బియ్యం గురించి నాలెడ్జ్‌ పెంచుకొవాలని టీడీపీ సభ్యులకు సూచించారు.

మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకం ప్రారంభించామని.. నాణ్యమైన బియ్యం ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే ప్రస్తుతం అందజేస్తున్న బియ్యానికి చాలా తేడా ఉందన్నారు. ప్రజలు బియ్యాన్ని అమ్ముకోకుండా.. తినాలనే ఆలోచన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉందాన్నారు. ఇదే విధంగా ఏప్రిల్‌ నుంచి ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. చంద్రబాబు హయాంతో పొల్చితే రూ. 1400 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు స్వర్ణ బియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం సరఫరాలో నూకలు 25 శాతం ఉండేదని.. ప్రస్తుతం నాణ్యమైన బియ్యంలో నూకలు 15 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. పాదయాత్రలో ప్రజల నుంచి అనేక సూచనలు తీసుకున్నానని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. పాదయాత్ర తర్వాత మేనిఫెస్టోను రూపొందిచామని.. అందులో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. ప్రజలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు.

Next Story
Share it