Telugu Gateway
Cinema

‘ప్రతి రోజూ పండగే’ మూవీ రివ్యూ

‘ప్రతి రోజూ పండగే’ మూవీ రివ్యూ
X

‘ఎవరికైనా చావు అంటే భయమే. నిజంగా చావు అన్నా కూడా భయం లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది చాలా అరుదే అని చెప్పొచ్చు. అయితే కొన్ని రోజుల్లోనే చనిపోతామని తెలిసిన ఓ పెద్దాయన చివరి రోజులు ఆయన కోరుకున్నట్లు సరదాగా గడిపేలా...తీరని కోరికలు తీర్చేలా చేయటమే ఈ సినిమా స్టోరీ లైన్. ‘చావును కూడా ఓ సెలబ్రేషన్’లా ఆహ్వానించటం..నవ్వుతూ చనిపోయేలా చేయటం కంటే ఏ తండ్రికైనా కొడుకులు..మనవళ్ళు ఇచ్చేది బహుమతి ఏమి ఉంటుంది’ అని చెపుతూ సాగుతుంది ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ కంటే సత్యరాజ్ అనే చెప్పాలి. సినిమా కథను మందుకు తీసుకెళ్లటానికే మాత్రమే హీరో పాత్ర ఉపయోగపడింది. కానీ నటన అంతా సత్యరాజ్ దే.

ఇప్పటి వరకూ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయిన రాశీ ఖన్నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ దొరికిందనే చెప్పాలి. టిక్ టాక్ గర్ల్ గా చలాకీగా ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకూ ‘శతమానంభవతి’ సినిమా గుర్తుకొస్తోంది. ఇదే సినిమాకు పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే సినిమా అంతా తండ్రిని ఊళ్ళో వదిలేసి విదేశాల్లో ఉధ్యోగాలు..వ్యాపారాలు చేసుకుంటూ బిజీగా గడిపే కొడుకులు ఉండటం...తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని తెలిసిన తర్వాత సొంత ఊరికి రావటానికి ‘లెక్కలు’ వేసుకోవటం..తీరా తాము వచ్చాక తండ్రి ఎక్కువ కాలం బతికితే తమ పరిస్థితి ఏంటి అన్న అంశాలు చర్చించుకోవటం అనే అంశాలపైనే సినిమా సాగిపోతుంది. సినిమా ఫస్టాప్ కూల్ గా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లు కన్పిస్తుంది.

తండ్రిని ఇంప్రెస్ చేసి ఆస్తి పంపకాలు జరిగాక కొన్న మామిడి తోట లో అధిక వాటా కోసం కొడుకులు చేసే పనులు తండ్రి బతికుండగానే సమాధి కట్టించటం, అంతిమ యాత్ర వాహనానికి డెకరేట్ చేయటం వంటివి కొంత ఇబ్బందికర సన్నివేశాలుగా ఉంటాయి. క్లైమాక్స్ లో కూడా హీరో ఏకంగా తన తండ్రితోపాటు బాబాబులు, అత్త చనిపోయినట్లు పిండాలు పెడుతున్నట్లు చూపించి వాళ్లను విదేశాల నుంచి మళ్ళీ వెనక్కి రప్పించి ‘కళ్ళు’ తెరిచేలా క్లాస్ పీకటం వంటి చాలా అసహజంగా అన్పిస్తాయి. సినిమాలో హైలెట్ అంటే సత్యరాజ్, రావు రమేష్, రాశీ ఖన్నాల పాత్రలే. దర్శకుడు మారుతి ఈ సినిమాలో మాత్రం తనదైన ‘ప్రత్యేక మార్క్’ చూపించలేకపోయారు. ప్రతి రోజూ పండగే సినిమా ఓ సాదా సీదా పండగలా నడిచిపోతుంది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it