ఏపీ సీఎంవోలో పెండింగ్ ఫైళ్ళు వేలల్లో!
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో). పరిపాలనకు అత్యంత కీలకం. పలు శాఖల నుంచి వచ్చే ఫైళ్లను సీఎంవోలోని అధికారులే పరిశీలించి ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేసి ఆయా ఫైళ్లపై సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ సీఎంవోలో గత కొన్ని నెలలుగా అందుకు భిన్నమైన వాతావరణం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు సీఎంవోలో పెండింగ్ ఫైళ్ళ సంఖ్య వేలల్లో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పలు శాఖల నుంచి ఫైళ్ళు సీఎంవోకు పోవటమే తప్ప..వెనక్కి రావటంలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పలు పనులు పెండింగ్ లో పడిపోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఎంవోలోని అధికారుల మధ్య అసలు ఏ మాత్రం సమన్వయం లేకుండా పోయిందని..అసలు అక్కడ ఏమి జరుగుతుందో సీఎంవోలో ఉండే అధికారులకు కూడా సమాచారం లేకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఫైళ్ళపై సంతకాలు చేయటానికి సమయం కేటాయించకపోవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
కేవలం తాను అనుకున్న నియామకాలు..తన ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్ లకు సంబంధించిన ఫైళ్లు తప్ప..మిగిలిన ఫైళ్లు చూసి సంతకాలు చేయటానికి సీఎం ఏ మాత్రం ఆసక్తిచూపటంలేదని..దీంతో పలు ఫైళ్లు అలా సీఎంవోలో పెండింగ్ లో పడిపోతున్నాయని చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవటం ఒకెత్తు అయితే..సీఎంలోని ఉన్నతాధికారులు కూడా ధైర్యం చేసి సీఎం సంతకం పెట్టాల్సిన ఫైళ్లు ఉన్నాయని..వారంలో కొంత సమయం అయినా దీనికి కేటాయించాలని కోరే సాహసం చేయలేకపోతున్నారని చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఫైళ్లు ఇంత భారీ ఎత్తున ఫైళ్ళు పెండింగ్ లో ఉన్న దాఖలాలు లేవని చెబుతున్నారు. పలు శాఖల మంత్రులు కూడా దీనిపై అసంతృప్తితోనే ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. మంత్రులు కానీ..ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా ఫైళ్ళ కోసం వేచిచూడటం తప్ప..సీఎంవోను అడిగి ఫైళ్ళు తెప్పించుకునే పరిస్థితి లేదన్నారు.