Telugu Gateway
Andhra Pradesh

ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు జైలుకెందుకు వెళ్తున్నారు

ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు జైలుకెందుకు వెళ్తున్నారు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు ఆయన తిరుపతిలో నిర్వహించిన తెలుగు భాషాభిమానుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంలో చదివితే అద్భుతాలు జరుగుతాయని..ఇక అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదన్నట్లు కొంత మంది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంత అద్భుతాలు జరిగితే ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న వాళ్లు ఎందుకు జైలుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీషు మాధ్యమం చదివినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆంగ్ల పదం లేకుండా తెలుగు మాట్లాడలేకపోతునందుకు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. ఇంగ్లీష్ తోనే అంతా అయిపోతుందనే తరహాలో ప్రభుత్వం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళుతుందని ఆరోపించారు.

ఆంగ్ల మాధ్యమానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, పిల్లలను ఏ మాధ్యమంలో చదివించాలో తల్లిదండ్రులకే స్వేచ్ఛ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు. పవన్ తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావే శాన్ని తెలుగు వైభవం పేరిట నిర్వహించారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ నాగబాబు హాజరయ్యారు. ఈ చర్చాగోష్టికి విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర రావు సమన్వయకర్త గా వ్యవహరించారు. అన్నింటి కంటే దారుణం ఏమిటంటే చాలా మంది తెలుగు హీరోలకు తెలుగు రాయడం, చదవడం రాదని తెలిపారు. తెలుగు సినిమాలు చేస్తారు. డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు కానీ తెలుగు రాయడం, ఉచ్ఛరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా ఇవన్నీ ఆవేదన కలిగించాయి. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ.. "పిల్లలకు మాతృ భాషలో ప్రాథమిక విద్య బోధన జరిగితే చక్కగా అర్ధమవుతుంది.

మాతృ భాషలో కాకుండా కొత్త భాషలో విద్య బోధన జరిగితే నేర్చుకోవడానికి సమయం పడుతుంది. జ్ఞానం, విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలంటే ఏకైక సాధనం మాతృ భాషే. మాట అనే వెలుగు లేకపోతే ప్రపంచం చీకటిమయం అయిపోతుంది. తరాలు మారితే మనిషి మారుతున్నాడు కానీ.. జంతుజాలం మారడం లేదు. కారణం మాతృభాషను కమ్యూనికేషన్ కు సంబంధించిన ఒక పరిమితమైన భాషగా మాట్లాడం కరెక్టు కాదు. కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నూతన విద్యా విధానం 2019లో కూడా భారతీయ భాషలు సుసంపన్నమైన భాషలు, ఇంగ్లీషుకు ఏ మాత్రం తీసిపోవని చెప్పారు. ఒక్క బ్యాంకింగ్ సర్వీసులుకి తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేయాలంటే పదో తరగతి వరకు చదువుకున్న శుద్ధమైన ఇంగ్లీషు చాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని పరీక్షలను ప్రాంతీయ భాషల్లో రాసుకొనే వెసులుబాటు కల్పించింద"ని గుర్తు చేశారు.

Next Story
Share it