Telugu Gateway
Politics

పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’

పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సమస్యలపై ఒక్క రోజు నిరహారదీక్ష చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పవన్ డిసెంబర్ 12న దీక్షకు కూర్చోనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆ పార్టీ వెల్లడించింది. ‘గిట్టుబాటు ధర లేక, ఖర్చులు సైతం రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. అనేక మంది రైతులు నన్ను కలిసి వారి అవస్థల గురించి చెప్పారు. పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని గత ఆదివారం మండపేట, పరిసర ప్రాంతాలలో పర్యటించాను. రైతులతో స్వయంగా మాట్లాడాను. వారు చెప్పిన మాటలు విన్న తరవాత మాటలలో చెప్పలేనంత బాధ అనిపించింది. వారి దుస్థితిని జగన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని సంకల్పించాను. మండపేటలో జరిగిన రైతు సమావేశంలో మూడు రోజులలో రైతుల సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో వేయమని ప్రభుత్వాన్ని కోరాను. వారి సమస్యలను పరిష్కరించమని చెప్పాను.

ప్రభుత్వంలో చలనం లేదు. 151 మంది బలం కలిగిన వైసీపీ ప్రభుత్వం అంతే బలంగా పని చేయవలసి ఉండగా ధాన్యం రైతుల పట్ల కనీస స్పందన చూపలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల సమస్యలను బలంగా తెలియచేయడానికే రైతు సౌభాగ్య దీక్ష తలపెట్టాను. గత రబీ సీజన్లోనే రైతులు తమ దుస్థితిని నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందనుకున్నా.. అది భ్రమగా మిగిలిపోయింది. గతంలో జగన్ రెడ్డి తన పాదయాత్రలో.. పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టం మిల్డ్ రైస్ (సి.ఎం.ఆర్.) ను ప్రకటించి, ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతా లో డబ్బు వేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ధాన్యం తీసుకున్న 45 రోజుల తరువాత హడావిడిగా అర్ధరాత్రి వేళ సి.ఎం.ఆర్. ప్రకటించి ఇంతవరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దాంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారు.’ అని తెలిపారు.

Next Story
Share it