Telugu Gateway
Andhra Pradesh

జగన్.. 151 సీట్లు వచ్చాక మాట మారుస్తారా?

జగన్.. 151 సీట్లు వచ్చాక మాట మారుస్తారా?
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఒక్కసారి కూడా తాము అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని ఉండదని చెప్పని జగన్..151 సీట్లు గెలిచాక మాట మారుస్తారా? అని ప్రశ్నించారు. జగన్ అమరావతి రాజధానిని వ్యతిరేకించి ఉంటే రైతులు భూములు ఇచ్చేవారు కాదని..అందరూ అంగీకరించినందునే వారు కూడా రాజధాని కోసం భూములు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు రైతులను మోసం చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప వ్యక్తులకు కాదన్నారు. పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఆయనతో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. మాట మార్చిన వారిని ఈ నేల క్షమించదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా ఎర్రబాలెం,కృష్ణాయ పాలెం గ్రామాల రైతులతో సమావేశం అయ్యారు.

మరోసారి ప్రాంతీయ విభేదాలు తలెత్తితే దేశ సమగ్రతకు నష్టం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలా జరిగిన విభజన వల్లే హైదరాబాద్ ను కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించటం సాధ్యంకాదని..దీనికి కొన్ని దశాబ్దాలు పడుతుందని అన్నారు. జగన్ కొన్ని జిల్లాలకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొద్ది మంది వ్యక్తులపై కోపాన్ని ప్రజలపై చూపించటం సరికాదన్నారు. రాయలసీమకు హైకోర్టు ఆ ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.హైకోర్టును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందన్నారు.రాజధాని తరలింపు అంశం లక్షలాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం అని పేర్కొన్నారు. పవన్ రైతుల దీక్షల వద్ద మాట్లాడుతూ ‘‘ ఇలా చేసుకుంటే పోతే ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఏముంది?. దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

రాజధాని రైతులకు నేను అండగా ఉంటా. బెదిరింపులకు రైతులు భయపడాల్సిన అవసరం లేదు.. మీరు భూములిచ్చింది ప్రభుత్వానికి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ. రాష్ట్ర భవిష్యత్‌ కోసం భూములిచ్చిన రైతుల్ని బెదిరిస్తున్నారు. రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి అరెస్ట్‌ చేయడం సరికాదు. మీ బిడ్డల భవిష్యత్‌ కోసం భూములు ఇస్తే పెయిడ్‌ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారు. అమరావతిలో రాజధాని ఇష్టం లేకపోతే 2014లోనే జగన్‌ రెడ్డి అసెంబ్లీలో చెప్పి ఉండాల్సింది. అప్పుడే జగన్‌ అసెంబ్లీలో చెప్పి ఉంటే రైతులు భూసమీకరణకు ఒప్పుకొని ఉండేవాళ్లు కాదేమో. హుద్‌హుద్‌ వస్తే కృష్ణా జిల్లా నుంచి ఎంతో సహాయం చేశారు. వైసీపీ నేతలకు ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర గుర్తురాలేదా?.’’ అని పవన్ ప్రశ్నించారు.

Next Story
Share it