Telugu Gateway
Andhra Pradesh

మూకుమ్మడి మత మార్పిడులపై పవన్ ఫైర్

మూకుమ్మడి మత మార్పిడులపై పవన్ ఫైర్
X

ఏపీలో సాగుతున్న మత మార్పిడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండానే ఇవన్నీ సాగుతున్నాయా?. అని ప్రశ్నించారు. కృష్ణా నది ఒడ్డున హిందూ భక్తుల నదీ స్నానాల కోసం, పుష్కరాల కోసం ఇంద్రకీలాద్రి పుణ్య స్థలిలో నిర్మించిన పున్నమి ఘాట్ లో హిందూయేతర మతస్తులు.. మత మార్పిడికి పాల్పడుతుంటే వై.ఎస్.ఆర్. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఆయన బుధవారం నాడు తిరుపతిలో జనసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పున్నమి ఘాట్ ను హిందువుల కోసం నిర్మించిన సంగతి ప్రభుత్వంలోని మంత్రులకు, హిందూ ఆలయాల కోసం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ మంత్రి తెలియదా? అని ప్రశ్నించారు.

జగన్ రెడ్డి ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ఘాట్లో సోమవారం ఒక్క రోజునే 42 మందికి మత మార్పిడి చేసారు. గత వారం రోజులుగా వందమందికి పైగా మత మార్పిడి చేశారు. ఇదేనా హిందూ మతానికి మీరు ఇచ్చే గౌరవం ? ఒక మతానికి సంబంధించిన పుణ్య స్థలంలో వేరే మతం వారు మత మార్పిళ్లకి పాల్పడుతుంటే దేవాదాయ శాఖ ఏమి చేస్తోంది. ఏ ప్రార్ధన స్థలమైన సరే ఆ మతాచారం ప్రకారం గౌరవించవలసిందేనని జనసేన విశ్వసిస్తోంది. పున్నమి ఘాట్ లో జరిగిన మతమార్పిడికి సంబంధించిన వీడియోను కూడా జనసేన విడుదల చేసింది.

హిందూ ధర్మాన్ని, మతాన్ని పరిరక్షించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? అన్నిటికీ సిద్ధమయ్యే మాట్లాడుతున్నా... ఎవరి అండ చూసుకుని ఈ పనులు చేస్తున్నారు? మిగిలిన పార్టీల్లోని హిందూ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగిలితే ఎందుకు మాట్లాడరు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? సూడో సెక్యులరిజంపై మౌనంగా కూర్చున్నారు. మిగతా మతాల ఓట్లు పోతాయనా?’’ అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it