అసెంబ్లీలో ‘ఉల్లి సవాళ్ళు’
ఉల్లి ఘాటుపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు హాట్ హాట్ చర్చ జరిగింది. సవాళ్లు..ప్రతి సవాళ్ళు..ఆరోపణలు..ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ఉల్లి ధర అంశంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అంటే ఏపీ ఒక్కటే అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా కూడా తాము ఇస్తున్నట్లు కిలో 25 రూపాయలకు ఇవ్వటంలేదని ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రేట్ల గురించి వివరించారు. మరోసారి కూడా రాష్ట్రంలోకి భారీ ఎత్తున ఉల్లి నిల్వలు రానున్నాయని, సాధ్యమైనంత మేర ఉల్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాము అతి తక్కువ ధరకే ఉల్లి ఇస్తున్నాము కాబట్టే అంత పెద్ద ఎత్తున క్యూలు ఉంటున్నాయని తెలిపారు. ఇవ్వకపోతే అక్కడకు ప్రజలు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. పనిలో పనిగా మరోసారి హెరిటేజ్ లో ఉల్లిపాయలు కిలో 200 రూపాయలు అమ్ముతున్నారని విమర్శించారు. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ‘సీఎం జగన్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు.హెరిటేజ్ ఫ్రెష్ మాది కాదు. ఈ విషయం స్పష్టం చేసినా పదే పదే ఇదే ఆరోపణలు చేస్తున్నారు.
హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ తమదే అని నిరూపిస్తే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని..నిరూపించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ సవాల్ పై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబు సవాల్ కు జగన్ ఎందుకు స్పందించాలి..గుడివాడలో రైతుబజారులో చనిపోయిన రైతు ఉల్లిగడ్డల కోసం రాలేదు అని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయటం అలవాటే అంటూ మండిపడ్డారు. మధ్యలో శాసనసభా వ్యవహారాలు, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని హెరిటేజ్ ఫ్రెష్ ను ప్యూచర్ గ్రూప్ నకు అమ్మినా అందులో చంద్రబాబు ఫ్యామిలీకి వాటా వచ్చిందని..అలాంటప్పుడు తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రచురించిందని బుగ్గన తెలిపారు.