కొడాలి నానిపై విమర్శలు..మహిళ అరెస్ట్
ఏపీలో తిట్ల రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. కొద్ది రోజులుగా మంత్రి కొడాలి నాని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలు తీవ్ర వివాదస్పదం కూడా అయ్యాయి. అయినా కూడా కొంత మంది మాత్రం తిట్ల దండకాన్ని ఏ మాత్రం ఆపటంలేదు. కొడాలి నాని చంద్రబాబుపై చేసిన విమర్శలకు కౌంటర్ గా అమరావతి ప్రాంతానికి చెందిన మంత్రి నానిపై యలమంచిలి పద్మ అనే మహిళ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మంత్రి కొడాలి నానిపై అభ్యంతరకర పదజాలంతో దూషణకు దిగారు.
దీంతో పోలీసులకు వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మంత్రి కోడాలి నానిపై తీవ్ర హెచ్చరికలు చేసింది. పద్మ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.