Telugu Gateway
Andhra Pradesh

లక్ష కోట్లతో రాజధాని సాధ్యం కాదు

లక్ష కోట్లతో రాజధాని సాధ్యం కాదు
X

మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, జీఎన్ రావు కమిటీ సిఫారసులకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఈ రెండు జిల్లాలో ఎమ్మెల్యేలతో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజధాని తరలింపు..అమరావతిలో భూముల వినియోగం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాజధాని అంటే నగరాల నిర్మాణం కాదని..నగరం ఉన్న చోటే రాజధాని భవనాల నిర్మాణం చేపట్టాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిపారు. ఇఫ్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల వ్యయం చేసి కొత్త నగరాలను నిర్మించటం సాధ్యం కాదని తమ అభిప్రాయం అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగన్ తో సమావేశం అనంతరం అంబటి రాంబాబు, పార్ధసారధి తదితర నేతలు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణ విషయంలో అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

రైతులను సంతోష పరిచేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాకుండా వాస్తవ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. తాత్కాలిక రాజధానిపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారని, ఈ రాజధానిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడులతో రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. గత ఐదేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు నాయుడు రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయినప్పటికీ ఒక్క శాశ్వత భవనం నిర్మించలేకపోయారని విమర్శించారు. అమరావతిని పూర్తి చేయాలంటే రూ. లక్ష పదివేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బును అప్పుగా తీసుకొస్తే వడ్డీలు చెల్లించడానికే కోట్ల రూపాయాలు అవుతాయన్నారు.

డబ్బులు విచ్చలవిడిగా ఉంటే రాజధాని ఎలాగైనా నిర్మించుకోవచ్చని, కానీ రాష్ట్ర ఖజానాలో అంత డబ్బులేదన్నారు. తక్కువ ఖర్చుతో ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపైనే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో అప్పుల భారం పెరిగిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రాజధాని విషయంలో అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్‌నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒకే చోట లక్షకోట్ల రూపాయల పెట్టుబడి అవసరమా అనేది జీఎన్‌ రావు కమిటీ సూచిందన్నారు. అమరావతిని నిట్టనిలువునా ముంచిన చంద్రబాబు... ఇప్పుడు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏ కులం మీదో..ప్రాంతం మీదో తమకు ద్వేషం లేదన్నారు. నిజంగా సీఎం స్వప్రయోజనాలు ఆశించే వారు అయితే రాయలసీమకో..దొనకొండకో రాజధాని తీసుకెళ్ళేవారు కదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it