నిపుణుల కమిటీ రైతుల అభిప్రాయాలు అడగలేదే?
అమరావతిలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన శుక్రవారం నాడు మరో నేత నాగబాబు, ఇతర పీఏసీ సభ్యులతో కలసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్రంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని ప్రకటించిన రాజధానిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఒక్కసారి అయినా భూములు ఇఛ్చిన రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిందా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజధాని భూములకు సంబంధించి మంత్రి చేసిన ప్రకటన దారుణంగా ఉందన్నారు. ఎంతసేపూ రంగులు వేయటం తప్ప ఎక్కడా ఒక్క రహదారి కూడా నిర్మించలేదని తెలిపారు.
పాలన చేతకాక రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని మనోహర్ వ్యాఖ్యానించారు. రైతుల త్యాగాలు గుర్తించలేనప్పుడు ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. రాజధాని రైతులను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. సరిహద్దులు లేని భూములను తిరిగి ఎలా ఇస్తారో మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రాజధాని రైతుల పోరాటానికి జనసేన అండగా ఉంటుందన్నారు. రైతు కూలీల గురించి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం-రైతుల మధ్య ఒప్పందాన్ని జగన్ పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇంత అరాచకంగా చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని నాగబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ ఓకే చెప్పబట్టే రైతులు రాజధానికి భూములు ఇచ్చారని...అసెంబ్లీలో జగన్ కూడా అమరావతికి అనుకూలంగా ప్రకటన చేశారు కదా? అని నాగబాబు ప్రశ్నించారు.