Telugu Gateway
Andhra Pradesh

మోడీకే ‘రిలీఫ్’ ఇస్తున్న జగన్ !

మోడీకే ‘రిలీఫ్’ ఇస్తున్న జగన్ !
X

రామాయపట్నం పోర్టు..కడప స్టీల్ అన్నీ మేమే కట్టుకుంటాం

ఇదెక్కడి వైఖరి..విభజన చట్టం హామీలూ అమలు చేయించుకోలేరా?

సర్కారు తీరుపై అధికారుల విస్మయం

ఏపీ ఆర్ధిక కష్టాల్లో ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సహజంగా ఈ తరుణంలో ఎవరైనా కేంద్రం నుంచి సాధ్యమైనంత మేర అధిక నిధులు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు. చట్టబద్ధంగా రావాల్సినవి తెచ్చుకోవటంతోపాటు..అదనపు నిధులు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ అదేమీ విచిత్రమో కానీ ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏదైనా సరే ‘మేమే చేసుకుంటాం..మేమే కట్టుకుంటాం’ అంటూ ముందుకెళుతోంది. మరి నిజంగా ఏపీ సర్కారు దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? అంటే అదీ లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇలా వ్యవహరిస్తోంది. దీని వెనక మతలబు ఏమిటి?. ఈ వ్యవహారం ఏమిటో అధికారులకు కూడా అంతు చిక్కటం లేదు. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవటానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇఛ్చింది. కానీ అది వచ్చే సూచనలు ఏ మాత్రం కన్పించటం లేదు. పోనీ విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రమే చేపట్టాలి. కానీ ఈ దిశగా గట్టిగా ప్రయత్నించని జగన్ సర్కారు ‘మేమే కట్టుకుంటాం’ అని ప్రకటించేసింది.

ఐదేళ్లు వేచిచూశాం..కేంద్రం ముందుకు రాలేదు కాబట్టి మేమే కట్టుకుంటాం అంటూ తాజాగా శంకుస్థాపన కూడా చేశారు. దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతామని సర్కారు ప్రకటించింది. మరి ఇందుకు అయ్యే డబ్బును ఎలా సమకూర్చుకుంటారు?. ఒక వేళ కట్టినా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నడపగలదా?. తన వాటాగా పది వేల కోట్ల ను ఇవ్వగలదా? కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఏముందని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకెత్తు అయితే శుక్రవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో రామాయపట్నం పోర్టును కూడా ఏపీ ప్రభుత్వమే నిర్మిస్తుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని కోసం కృష్ణపట్నం పోర్టుకు ఉన్న పరిధిని తగ్గించినట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టును అభివృద్ది చేయటానికి కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసింది.

వాస్తవానికి విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్టును కేంద్రం అభివృద్ధి చేయాలని ఉంది. అయితే అక్కడ సాంకేతిక సమస్యలు రావటంతో ప్రత్యామ్నాయంగా రామాయపట్నం పోర్టును చేపడతాని ప్రకటించింది. కానీ జగన్ సర్కారు తూచ్ అంటూ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపడతామని తెలిపింది. ఇదొక్కటే కాదు..మచిలీపట్నం పోర్టును కూడా ప్రభుత్వమే చేపడుతుందని..దీని కోసం ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించిందని పేర్ని నాని తెలిపారు. ఓ వైపు అమరావతిలో రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని చెబుతూ..విభజన చట్టం ప్రకారం కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టులను రాష్ట్రమే నెత్తికెత్తుకుని వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపం ఎంతవరకూ సమంజసం అని ఓ అధికారి ప్రశ్నించారు. ఓ వైపు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలే కన్పించటం లేదని..ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులను కేంద్రంతో చేయించుకోకుండా జగన్ సర్కారు ‘మోడీకే రిలీఫ్’ ఇస్తున్నట్లు వ్యవహరించటం ఏంటో అర్ధం కాకుండా ఉందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it