Telugu Gateway
Politics

బత్తాయి చెట్లు నరుకుతారు..ప్రత్యేక హోదా అడగలేరు

బత్తాయి చెట్లు నరుకుతారు..ప్రత్యేక హోదా అడగలేరు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బత్తాయి చెట్లు నరికే ధైర్యం ఉంది కానీ ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదన్నారు. ప్రజా సమస్యలను కేంద్రం ముందుకు తీసుకెళ్లే ధైర్యం లేనప్పుడు 22 మంది ఎంపిలు ఉండి ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. పసుపు రైతుకు న్యాయం చేయలేరు. వారికి శీతల గిడ్డంగులు కట్టించలేరు గానీ భారతీ సిమెంట్స్ లాంటివి కట్టుకుంటారు. జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తాను. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తాను. రాయలసీమకు ఉక్కు కర్మాగారం కావాలన్న డిమాండ్ ఉంటే, జగన్ రెడ్డి పీఎంఓకు వెళ్లి అణుశుద్ధి కర్మాగారం అడుగుతున్నారు. ఓ పక్క తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంతో చుట్టుపక్కల ఆరేడు గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడుతుంటే ఆయన అదే కర్మాగారం కావాలని కోరుకుంటున్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు కడప జిల్లాలోని రైల్వే కోడూరులో పర్యటించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ నాయకులకు చెబుతున్నా ముందుగా మీ నాయకుడికి పద్దతి మార్చుకోమని, హుందాగా మాట్లాడమని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి.

తనకు వైసీపీ నాయకుల మీద గానీ, జగన్ రెడ్డి మీద గానీ ఎలాంటి శత్రుత్వం లేదు. వైసిపీ కార్యకర్తల్లోనూ నాకు అభిమానులున్నారు. సీమ సమస్యల మీద అనంతపురం కవాతుకు పిలుపు ఇస్తే మూడు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ఓట్లు ఎందుకు వేయలేదు అంటే ఊర్లలో జనసేనకు ఓటు వేస్తామంటే ఊరుకోమంటూ వైసీపీ నాయకులు భయపెట్టారు అని యువత చెబుతున్నారు. రైల్వే కోడూరులో స్థలం అడిగింది ఇల్లు కట్టుకోవడానికి కాదు. పెద్ద గ్రంథ్రాలయం ఏర్పాటు చేయడానికి. ఇది ఫ్యాక్షన్ సీమ కాదు. చదువుల సీమ. అలాంటి సీమలో మీకు పిరికితనం ఆవహించడం ఏంటి?. జ్ఞానం ధైర్యాన్నిస్తుంది. మీలో జ్ఞానాన్ని నింపేందుకు ఇక్కడ పెద్ద గ్రంథాలయం కడతాను. అది ఇక్కడికి వచ్చినవారంతా వచ్చి చదువుకునేంత పెద్దదిగా ఉంటుంది. జ్ఞానం అనే ఖడ్గంతో పిరికితనాన్ని చంపాలి. జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరికీ ఎన్ని ఓట్లు పడతాయి. ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు. సమాజాన్ని ఆవహించిన పిరికితనాన్ని పారద్రోలాలన్న లక్ష్యంతో వచ్చాను. తెల్లచొక్కా పంచెకట్టుకున్న వారికే పనులు జరిగితే ఎలా. సంపద కొద్ది మందిదే కాదు. సీమ ఒక్క జగన్ రెడ్డి దే కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి చీని చెట్లు నరికేస్తాం, అవసరం అయితే మనల్ని కూడా నరికేస్తాం అన్న భయం కలిగిస్తున్నారు.

మన దేశంలోనే సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువ. నేను రాయలసీమ పర్యటనలో చూస్తే నాయకులు ఉన్న చోట పొలాలు పచ్చగా ఉన్నాయి. సామాన్యులు ప్రజల భూములు ఎండిపోవడం బాధ కలిగించాయి..చాలా సార్లు రాయలసీమకు వచ్చినప్పుడు ఇంత మంది యువత ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ చూసిన ఆవేదన, కోపం, పౌరుషం, కడుపు మంట కనబడుతూ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అది పిసరంత తక్కువే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారంటే.. నిజానికి ఇక్కడ కరువు లేదు. సృష్టించబడింది. రాయలవారు ఏలిననాడు తటాకాలు, చెరువులు పెట్టి కాలువలు తవ్వించి, అప్పుడు సశ్య శ్యామలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు పండవు. ఇక్కడున్న నాయకత్వం లోపమే అది. రాయలసీమ నుంచి జగన్ రెడ్డి గారితో సహా ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే ఎందుకు వెనుకబాటు ఉంది? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపేసే పరిస్థితులు ఎక్కువ. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నచ్చిన పార్టీకి మద్దతు ఇస్తారు. నాయకులు ఇక్కడిలా ఇళ్లలోకి వచ్చి ధ్వంసాలు చేయరు. నాయకులకు ఎదురు తిరిగితే మన ఇళ్ల మీద దాడులు చేస్తారు, చెట్లు నరికేస్తారు అన్న ధోరణి మారాలి అని పేర్కొన్నారు.

Next Story
Share it