మీడియా ‘రంగులు’ విప్పిన జగన్
వాళ్ళకు అనుకూలమైన పేపర్లు, చానళ్ళు వాళ్ళకుంటాయి
మా అనుకూల పేపర్లు, ఛానళ్లు మాకుంటాయి
అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ‘రంగులు’ విప్పారు. ఆయన అసెంబ్లీలో సాక్షి పేరు ఎత్తితే ఫైర్ అవుతున్నారు. అంతే కాదు. వాళ్ళ పేపర్లు వాళ్ళ కుంటాయి..మా పేపర్లు మాకుంటాయి అని తేల్చిచెప్పారు. మరి ఇక పేపర్లు..టీవీలకు రంగులు వేయటం ఎందుకు?. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశం చర్చ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉండగా మునిసిపల్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగానే సాక్షి దీనికి వ్యతిరేకంగా రాసిందని..సాక్షి ఒకటి..జగన్ ఒకటా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. దీనిపై జగన్ మండిపడ్డారు. ‘ బేసికల్లీ పేపర్ ఓ వ్యవస్థ. ఈనాడు వాళ్లకుంటది. సాక్షి అనే పేపర్ ఈనాడుకు అపోజిట్ గా ఇంకో వ్యవస్థ ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. వాళ్ళకు అనుకూలమైన చానళ్ళు, పేపర్లు వాళ్ళకు ఉంటాయి. మాకు అనుకూలమైన పేపర్లు, మాకు అనుకూలమైన చానళ్ళు మాకుంటాయి. అంతేకానీ ఆ వ్యవస్థలు రాసిన దాంట్లో మనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చి మాట్లాడితే ఎలా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నీకు సిగ్గూ, శరం, దమ్మూ ధైర్యం ఉంటే చూపించమని అడుగుతున్నా?. అంటూ చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. అదే సమయంలో చంద్రబాబుపై అసలు బుద్ధి ఉందా? సిగ్గు ఉందా అంటూ మండిపడ్డారు. సాక్షిలో ఏం రాశారో చర్చించడానికి అసెంబ్లీ లేదని.. మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దామని చెప్పారు. దీనికి సంబంధించి మాత్రమే చర్చ జరగాలని జగన్ వ్యాఖ్యానించారు. 2017లో తాము ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో వ్యతిరేకించారని.. ఇప్పుడు మీ పిల్లలెక్కడ చదువుతున్నారని ప్రశ్నిస్తున్న వారి పిల్లలు ఆ సమయంలో ఎక్కడ చదివారని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి ఏరోజైనా ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించాడని నిరూపించడానికి సిద్ధమా అని జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. కళ్లు పెద్దవి చేస్తే భయపడతామా ఏమన్నా అని మండిపడ్డారు. నారాయణ స్కూల్స్ కు మేలు చేసే దాని కోసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలని ప్రతిపక్ష నేతనుద్దేశించి సీఎం కామెంట్స్ చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. తాను సిగ్గుతో తలంచుకోవడం కాదని, జగన్ సిగ్గుతో తలదించుకోవాలని.. క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు క్షమాపణ చెప్పి, తాను మోసం చేయలేదని జగన్ చెప్పుకోవాలని చంద్రబాబు చెప్పారు. సాక్షిలో రాస్తే తనకు సంబంధం లేదనట్టుగా జగన్ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘మీ పేపర్‌కు విశ్వసనీయత లేదా’? అని జగన్‌ను ప్రశ్నించారు. ‘మీ పేపర్ ఒక చెత్త పేపర్’ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనను బుద్ధి, జ్ఞానం లేదని సీఎం అన్నారని, సాక్షికి బుద్ధి, జ్ఞానం ఉందా అని నిలదీశారు. తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు.