Telugu Gateway
Andhra Pradesh

జగన్ గురించి ముందే చెప్పా...జెసీ

జగన్ గురించి ముందే చెప్పా...జెసీ
X

టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ మాటలు అన్నారు. ‘జగన్ గురించి మీకు ముందే చెప్పా. రాజశేఖరరెడ్డిలో ఉన్న పది శాతం మంచి లక్షణాలు కూడా జగన్ లో లేవు. జగన్ వి అచ్చం రాజారెడ్డి లక్షణాలు’ అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్‌తో తనకు సాన్నిహిత్యం ఉన్నందున చిన్నప్పటి నుంచి జగన్‌ గురించి తెలుసు అన్నారు. ‘మిమ్మల్ని నమ్ముకున్నందుకు అందరినీ సంకనాకించావు’ అంటూ చంద్రబాబు ముఖం మీదే జె సీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రెండున్నర సంవత్సరాల్లో ఎన్నికలు వస్తాయని..కొంత కాలం మీరు మౌనంగా పరిస్థితులను గమనిస్తూ ఉంటే మంచిదని సూచించారు. చంద్రబాబులో కూడా మార్పు రావాలని కోరారు. శాంతివచనాలతో చంద్రబాబు తమను దెబ్బతీశారన్నారు.

గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా వినలేదన్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలే 100 శాతం నయమని చెప్పారు. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దని సూచించారు. ‘మీరు ఈ ఐదేళ్లలో రిటైర్‌ కారు. మేం మళ్లీ వస్తాం, మీ పేరు గుర్తించుకుంటామన్నారు. పోలీసులంతా జగన్‌కు వంగివంగి దండాలు పెడుతున్నారని గుర్తుచేశారు. అదే సమయంలో పోలీసులపై జె సీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎమ్మెల్యేలకు సెల్యూట్‌ కొడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి అలా ఉండదని వ్యాఖ్యానించారు. బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటా అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టిస్తా అని తెలిపారు.

Next Story
Share it