Telugu Gateway
Cinema

‘ఇద్దరిలోకం ఒకటే’ మూవీ రివ్యూ

‘ఇద్దరిలోకం ఒకటే’ మూవీ రివ్యూ
X

ప్రమాదం కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది. కానీ ఈ సినిమాలో ఓ ప్రమాదం అమ్మ కడుపు లో ప్రమాదంలో ఉన్న అమ్మాయిని కాపాడుతుంది. ప్రాణంతో బయటకు తీసుకొస్తుంది. అక్కడ నుంచి మొదలయ్యే సినిమా ఎన్నో మలుపులు తీసుకుంటుంది. హీరో రాజ్ తరుణ్ కు ఈ మధ్య కాలం కలసి రావటం లేదు. ‘ఇద్దరి లోకం ఒకటే’ కూడా రాజ్ తరుణ్ కు కలసి రాలేదనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫంక్షన్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పరిశ్రమలో ‘సెంటిమెంట్’ను ఎక్కువ నమ్ముతారని చెప్పారు. మరి అది సెంటిమెంట్ అంటారు..లేక కథలో దమ్ములేకో కాని ఈ సినిమా కూడా అత్యంత సాదాసీదా సినిమాగా మిగిలిపోతుంది. అయితే ఈ సినిమాకు బలం మాత్రం హీరోయిన్ షాలిని పాండేనే. ఎలాగైనా హీరోయిన్ కావాలనే తన కోరిక నెరవేర్చుకునేందుకు అందరి చుట్టూ తిరుగుతూ..ఆడిషన్స్ సమయంలో చేసే నటనతో ఆకట్టుకుంటుంది షాలినీ. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రాజ్ తరుణ్ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేకపోయినా హీరో పాత్ర అత్యంత సాదాసీదాగా నిలిచిపోతుంది. చిన్నప్పుడే అమ్మాయి..అమ్మాయి ప్రేమలో పడటం...ఆ తర్వాత తల్లిదండ్రులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లటం కారణంతో వాళ్లిద్దరూ విడిపోవటం..మళ్లీ టీనేజ్ లో కలుసుకోవటం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే బొచ్చెడు ప్రేమకథలు వచ్చాయి. ఇంచుమించు ఇది కూడా అలాంటిదే. అయితే ఇందులో హీరో తండ్రి ఫోటోగ్రాఫర్ కావటం..జీవితంలో ప్రతి మూమెంట్ ను తన ఫోటోల్లో బంధించటం అనే ఓ పాయింట్ ను తీసుకుని..హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కు బీజం వేశారు.

సినిమా అంతటా..లవ్ ట్రాక్ లో కానీ ఎక్కడా ‘ఫీల్’ కన్పించదు. ప్రతి ప్రేమ సన్నివేశం ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన సన్నివేశాలను గుర్తుచేస్తాయి.ఈ సినిమాలో హీరో కు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంటుంది. చిన్నప్పటి స్నేహితురాలు కలిశాక..ప్రేమ విషయం చెప్పేందుకు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తిరుగుతాడు. కానీ తన ప్రియురాలి తొలి సినిమా ప్రివ్యూ చూడటానికి వెళ్లి పడిపోతాడు. విషయం తెలుసుకున్న హీరోయిన్ హాస్పిటల్ కు వెళుతూ ఘోర ప్రమాదానికి గురవుతుంది. దీంతో ఆమె బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు ప్రకటిస్తారు. అలా బ్రెయిన్ డెడ్ అయిన హీరోయిన్ గుండె ను హీరోకు ట్రాన్స్ ప్లాంట్ చేసి..‘ఇద్దరి లోకం ఒకటే’ అని చెప్పాడు దర్శకుడు జీ ఆర్ కృష్ణ. యూత్ కోసమా అన్నట్లు సెకండాఫ్ లో హీరో,,హీరోయిన్ల మధ్య లిప్ కిస్ లు పెట్టాడు దర్శకుడు. ఇది అత్యంత సాదాసీదా పాత ప్రేమకథ.

రేటింగ్.2/5

Next Story
Share it