Telugu Gateway
Politics

కర్ణాటకలో హానీట్రాప్ కలకలం..వీడియోలు బయటకు!

కర్ణాటకలో హానీట్రాప్ కలకలం..వీడియోలు బయటకు!
X

మొన్న మధ్యప్రదేశ్. నిన్న కర్ణాటక. రాష్ట్రాలకు రాష్ట్రాలను వణికిస్తున్నాయి ఈ ‘హానీట్రాప్ లు’. మధ్యప్రదేశ్ లో అయితే ఏకంగా గవర్నర్ దగ్గర నుంచి మొదలుపెట్టి మంత్రులు..ఎమ్మెల్యేలు, ఐఏఎస్ లు ఎంతో మంది ఇందులో చిక్కుకుని విలవిలలాడినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కర్ణాటకలో ఎమ్మెల్యేలు పలువురు హానీట్రాప్ లో చిక్కుకుని కోట్లాది రూపాయలు చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఏకంగా పదిమందికి పైగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కేసు రోజురోజుకు ఎన్నో మలుపు లు తీసుకుంటోంది. గత ఆగస్టు నుంచి జరుగుతున్న హనీట్రాప్‌ దందాలో సీరియల్‌ నటి బృందానికి మాజీమంత్రులు, శాసనసభ్యుల రాజకీయ ప్రత్యర్థులకు లక్షలాది రూపాయలు అందించి సహకారం అందించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. హనీట్రాప్‌ వెలుగులోకి వచ్చిన అనంతరం పలువురు ప్రజాప్రతినిదులు, ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

కీలక నిందితుడు రాఘవేంద్ర, అతని ప్రియురాలు తదితరుల నుంచి సీసీబీ పోలీసులు స్వాదీనం చేసుకున్న ఎల్రక్టానిక్స్‌ పరికరాల్లో పదిమందికి పైగా ప్రజాప్రతినిధులు, మాజీమంత్రుల వీడియోలు లభ్యమయ్యాయి. ఇంకా అనేకమంది హనీట్రాప్‌ ఇరుక్కుని డబ్బులు ముట్టజెప్పినట్లు చెబుతున్నారు. హనీట్రాప్‌లో ఎమ్మెల్యేలు, అధికారులను బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన మహిళలు రాత్రి 10 గంటల అనంతరం మొబైల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసి అర్ధరాత్రి వరకు సంభాషించడం, ఎమ్మెల్యేలు మద్యం మత్తులో ఉండటాన్ని ధ్రువీకరించుకుని మహిళలు రంగంలోకి దిగేవారు. హనీట్రాప్‌ వలలో పడిన ఎమ్మెల్యేలు, యువతులను ఎమ్మెల్యేలు తరచుగా పిలిపించుకునేవారు. ఈ నీచకృత్యాలను పెట్టుబడిగా పెట్టుకున్న వంచకముఠా వీడియోలు తీసి భారీనగదును ఇవ్వాలని నాయకులను ఒత్తిడి చేసేవారు. రాఘవేంద్ర వద్ద ఏడుకు పైగా మొబైల్స్, 15 సిమ్‌కార్డులను స్వాదీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన హనీట్రాప్‌ ముఠా తమ బృందంలోని ప్రముఖులు అరెస్ట్‌ కావడంతో కొందరు పరారీలో ఉన్నారు. ఓ ఎమ్మెల్యే హనీట్రాప్‌ ముఠాలో చిక్కుకోగా రహస్యంగా చిత్రీకరించడానికి రూ.10 లక్షలు ఇవ్వాలని సీరియల్‌ నటి ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రత్యర్థిని అడిగారు.

నియోజకవర్గంలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించి క్యాంప్‌ నిర్వహించాలని, వారం రోజుల పాటు ఉండటానికి వ్యవస్థ కల్పించాలని అని ఓ జిల్లా ఎమ్మెల్యే వద్ద హనీట్రాప్‌ ముఠా సభ్యులు విన్నవించారు. ప్రారంభంలో మహిళ పట్ల అసక్తి చూపని ఎమ్మెల్యే అనంతరం మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఎమ్మెల్యే రాసలీలను సీరియల్‌ నటి రహస్యంగా చిత్రీకరించి తన అనుచరులకు అందజేశారు. ఆ సీడీని ఎమ్మెల్యేకు చూపించి రూ.50 కోట్లకు డిమాండ్‌ పెట్టారు. అంత డబ్బు తన వద్దలేదనడంతో కనీసం రూ.10 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉడుపి జిల్లా, ఉత్తర కన్నడ జిల్లా ఎమ్మెల్యేల వీడియోలు కూడా బయటపడ్డాయి. రహస్య కెమెరా కలిగిన హ్యాండ్‌బ్యాగ్‌ల సాయంతో రికార్డింగ్‌ చేసేవారని తెలిసింది. కొంత మంది ప్రజాప్రతినిధుల రాసలీలలకు చెందిన వీడియోలు బయటకు రావటంతో ఇది పెద్ద దుమారం రేపుతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు ఇవి ఎక్కడా మీడియాలో రాకుండా అడ్డుకోవాలంటూ కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయించటానికి రెడీ అయ్యారు.

Next Story
Share it