సచివాలయం వైజాగ్ లో..మంత్రుల క్వార్టర్లు అమరావతిలోనా?
జీఎఎన్ రావు కమిటీ కామెడీ
ప్రాంతమే కాకుండా స్థలాల ఎంపిక కూడా కమిటీయే చేసిందా?
మరి సచివాలయం ఎక్కడ కట్టాలో ఎందుకు చెప్పలేదు?
33 వేల ఎకరాల్లో అసలు ఏదీ నిర్మాణాలకు పనికిరాదా?
సచివాలయం అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం. మంత్రులు..ఐఏఎఎస్ అధికారులు, ఇతర ఉద్యోగులు అక్కడే ఉండి రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూస్తారు. మరి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన నిపుణుల కమిటీ ఏంటి సెక్రటేరియట్ వైజాగ్ లో పెట్టి..మంత్రుల క్వార్టర్లు అమరావతిలో కట్టాలని చెబుతోంది. అంటే మంత్రులు వైజాగ్ లో కాకుండా అమరావతిలో ఉండి ఏమి చేస్తారు?. కమిటీ సిఫారసుల ప్రకారం ప్రభుత్వపరమైన కార్యకలాపాలు వైజాగ్ కేంద్రంగానే సాగుతాయి. మరి అమరావతిలో మంత్రుల నివాసాలు ఎందుకో ఎవరికీ అర్ధం కాదు. అంటే అమరావతిలో పాటు వైజాగ్ లో కూడా మంత్రుల నివాసాలు కట్టాలన్న మాట. జీఎన్ రావు కమిటీ ప్రధానోద్దేశం ఏ ప్రాంతంలో ఏమి చేస్తే బావుంటుందో చెప్పటం. అసలు ఈ కమిటీ ఎందుకేశారు..దాని అసలు లక్ష్యాలు ఏంటి అనే సంగతి పక్కన పెడితే..కొత్తగా చేపట్టే నిర్మాణాలు పలానా చోటే కట్టాలని.. యూనివర్శిటీ పక్కన లేకపోతే ఏదో వెంచర్ పక్కన అని అంత సూక్ష్మంగా చెప్పాల్సిన ఆవశ్యకత కమిటీకి ఏమిటో అని ఓ సీనియర్ అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంటే రాజధాని కోసం సేకరించిన 33 వేల ఎకరాల్లో ఎక్కడా నిర్మాణాలు కట్టేందుకు అనువైన ప్రదేశాలే లేవా?. అంటే సర్కారుకు అసలు ఆ భూముల్లో కొత్త నిర్మాణలు ఏమీ చేపట్టవద్దనే ఆలోచన ఉంది కనుక కమిటీ కూడా అలాగే సిఫారసు చేసిందని అనుమానించాల్సిన పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. మరి ఇదే తరహా వైజాగ్ లో సచివాలయం, ఇతర భవనాలు, కర్నూలులో హైకోర్టు ఏ ప్రాంతంలో కట్టాలో కమిటీ ఎందుకు సిఫారసు చేయలేదు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సేకరించిన భూములు ఏమీ లేవు కాబట్టే అనుకోవచ్చు. అమరావతికి వరద ముప్పు ఉందని జీఎన్ రావు కమిటీ తెలిపింది. ఓకే...నిజమే అనుకుందాం. మరి నిత్యం పరిపాలన సాగాల్సిన వైజాగ్ కు ఆ ప్రమాదం లేదా?. హుద్ హుద్ తుఫాన్ సమయంలో ఏకంగా విమానాశ్రయం పై కప్పు లేచిపోయిన సంగతి గుర్తులేదా?.
వైజాగ్ నగరం కకావికలం అయింది. అలా చూస్తే వైజాగ్ తో పోలిస్తే అమరావతికే వరద, తుఫాన్ల ముప్పు తక్కువ. హైకోర్టు పెట్టాలని సూచించిన కర్నూలు అయితే ఓ సారి ఏకంగా నగరం నగరం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఏకంగా ఫైఓవర్లపై కూడా నీరు పారిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో ఊహించుకోవచ్చు. అమరావతి అనేది చరిత్రలో ఓ నామమాత్రంగా మిగలాలే తప్ప..దానికి ప్రాధాన్యత ఉండకూడదు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆలోచనగా ఉంది. ఆ దిశగానే ప్రస్తుత పరిణామాలు చకచకా సాగుతున్నాయి. అత్యంత కీలకమైన సెక్రటేరియట్, ఇతర కీలక భవనాలను వైజాగ్ కు తరలించటం అంతా పక్కా ప్లాన్ ప్రకారం సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.