రాజధాని భూ లావాదేవీలపై విచారణ
కేబినెట్ గ్రీన్ సిగ్నల్
అమరావతి పేరుతో సాగిన భూ దందాపై విచారణకు ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సీబీఐనా లేక సీబీసీఐడీ, లోకాయుక్త విచారణా అన్నది మాత్రం న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాత ముందుకెళ్ళాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. బాగా తిన్న కోడి ఇళ్ళు ఎక్కి అరిచినట్లు కొంత మంది అక్రమ లావాదేవీలు జరిపిన వాళ్ళు దమ్ముంటే చర్యలు తీసుకుంటే..కేసులు పెట్టుకోండి అని సవాళ్లు విసురుతున్నారని..వారి కోరిక నెరవేరే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను మంత్రివర్గ సమావేశంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రాథమికంగా చాలా తప్పులు జరిగినట్లు తేలాయని పేర్ని నాని వెల్లడించారు. గత ప్రభుత్వ పెద్దలు..వారి సన్నిహితులు..వారికి అండగా ఉండే వారు ఇలా ఎంతో మంది భూములు కొనుగోలు చేశారని తెలిపారు.
న్యాయ నిపుణుల సలహాతో దీనిపై సమగ్ర విచారణ సాగుతుందని వెల్లడించారు. సాక్ష్యాత్తూ అప్పటి ముఖ్యమంత్రికి వాటాఉన్న సంస్థ కూడా భూములు కొనుగోలు చేసిందని..ఈ వివరాలు అన్నీ కూడా కమిటీ తేల్చిందని తెలిపారు. ఎవరెవరు ఏ తారీఖున కొన్నారు. 2014 డిసెంబర్ 31నరాజధాని ప్రకటిస్తే.అంతకు ముందు భూములు కొనుగోలు చేసిన వారు ఎవరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కొంత మంది కారు డ్రైవర్లు, ఇతర వ్యక్తులతో కొనుగోలు చేసిన అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయన్నారు. పాపం పండిన రోజు అన్నీ బయటకు వస్తాయని తెలిపారు.