Telugu Gateway
Telangana

దిశ రేప్...ప్రజా తీర్పును అమలు చేసిన పోలీస్

దిశ రేప్...ప్రజా తీర్పును అమలు చేసిన పోలీస్
X

సహజంగా ప్రజల తీర్పు ఎన్నికల్లోనే ఉంటుంది. కానీ ఈ సారి ‘ప్రజా తీర్పు’ ఓ నేరం విషయంలో అమలైంది. ప్రజలు ఏమి కోరుకున్నారో పోలీసులు అదే చేశారు. తరతమ బేధం లేకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశమంతా ముక్తకంఠంతో ఏది అయితే డిమాండ్ చేసిందో అదే జరిగింది. కోర్టులు..కేసులు...జైళ్ళు కాదు..తక్షణ న్యాయం జరగాలని అందరూ నినదించారు. బహుశా కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజలు అందరూ స్వచ్చందంగా రోడ్డెక్కి షాద్ నగర్ పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్లి నిందితులను మాకు అప్పగించండి..మేం చూసుకుంటూ అంటూ నినదించారు. ఆ తర్వాత చర్లపల్లి జైలు దగ్గర కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే ప్రజలు కోరుకున్న విధంగా దిశా నిందితులకు సరైన శిక్ష పడింది.

అత్యంత హేయంగా..దారుణంగా దిశను రేప్ చేసిన నిందితులను శుక్రవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ఇది నిజమైన ఎన్ కౌంటర్ కాదా? అనే చర్చను పక్కన పెడితే దేశం కోరుకున్నదే జరిగింది. దీంతో దిశకు సత్వర న్యాయం జరిగిననట్లే భావించాలి.శుక్రవారం తెల్లవారుజామున షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. గత నెల 27న వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను గురువారంపోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా .... దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా...వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు.

దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. తాజా ఎన్ కౌంటర్ తో ఇక ఇది అవసరం లేకుండా పోయినట్లే. ఈ ఎన్ కౌంటర్ తో అయినా భవిష్యత్ లో రేప్ లు జరగకుండా ఉండాలని ఆశిద్దాం.

Next Story
Share it