Telugu Gateway
Telangana

రెండు తెలుగు ఛానళ్ళ ‘రేటింగ్ గోల్ మాల్’..ఛార్జిషీట్ దాఖలు

రెండు తెలుగు ఛానళ్ళ ‘రేటింగ్ గోల్ మాల్’..ఛార్జిషీట్ దాఖలు
X

తొలిసారి బ్రాడ్ కాస్ట్ అడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) రెండు తెలుగు ఛానెళ్ల రేటింగ్ గోల్ మాల్ వ్యవహారంపై కేసు పెట్టింది. బార్క్ పెట్టిన కేసు ఆధారంగా వెస్ట్ మారెడ్ పల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అంతే కాదు ఏకంగా ఏడుగురు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం మీటర్లలో గోల్ మాల్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల వరకూ కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్పాంల్లో టీవీ రేటింగ్స్ అక్రమాలపై దృష్టి పెట్టిన బార్క్ తొలిసారి తెలంగాణలోనూ రంగంలోకి దిగింది. తెలంగాణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వెస్ట్ మారేడ్ పల్లి స్టేషన్ లో కేసు పెట్టింది. నిందితులు ఇద్దరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రెండు ఛానెళ్ళతో సంబంధం ఉందని గుర్తించారు. టీవీ రేటింగ్స్ తారుమారు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఛార్జిషీట్ దాఖలు దాఖలు చేటయం తెలంగాణలో ఇదే మొదటిసారి అని బార్క్ వెల్లడించింది.

టీవీ రేటింగ్ లను గుర్తించి రిపోర్ట్ చేసే బార్క్ గృహ మీటర్లను తారుమారు చేసి టెలివిజన్ పరిశ్రమకు నష్టాలు కలిగించినట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. టీవీ రేటింగ్ లను తారుమారు చేయటంలో నిందితుల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టి పోలీసులు పలు అంశాలను నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత నిందితుల పాత్ర ఉందని తేలటంతో దర్యాప్తు అధికారులు సికింద్రాబాద్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేశారు. బార్క్ రేటింగ్స్ ఆధారంగానే ఛానళ్లకు యాడ్స్ వస్తాయి. రేటింగ్స్ లో గోల్ మాల్ కు పాల్పడితే ఆయా ఛానళ్ళ ప్రకటనల ఆదాయం కూడా పెరుగుతుందనే విషయం తెలిసిందే. యాడ్స్ ఆదాయం కోసమే కొన్ని ఛానళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయని గుర్తించారు. అయితే ఆ ఛానళ్లు పేర్లు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది.

Next Story
Share it