పవన్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలను తాము పట్టించుకోం అంటూనే ఏపీ హోం మంత్రి సుచరిత ఆయనపై విమర్శలు చేశారు. ఒక్క చోట కూడా గెలవని వారు చేసే వ్యాఖ్యలపై తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరితో ఉంటారో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు. మత మార్పిడి చేసుకోవడం నేరమా? అని మంత్రి ప్రశ్రించారు. ఇష్ట ప్రకారం మతమార్పిడి చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. ఎవరూ డబ్బులు ఇఛ్చి మత మార్పిడిలను ప్రోత్సహించరని మంత్రి వ్యాఖ్యానించారు.
డబ్బులిస్తే ఎవరైనా మతం మారతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే.. వైసీపీ ఎక్కడ ఉండేదని పవన్ వ్యాఖ్యలకు సుచరిత కౌంటరిచ్చారు. 151 సీట్లు ఇచ్చి వైసీపీని ప్రజలు గుర్తించారని, దిశ ఘటనలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు వేస్తే.. సరిపోతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. నిందితులకు వేగంగా శిక్ష పడాలన్నదే తమ అభిమతమని సుచరిత చెప్పారు.