Telugu Gateway
Andhra Pradesh

సర్కారు సారధ్యంలోనే ‘కడప స్టీల్ ప్లాంట్’

సర్కారు సారధ్యంలోనే ‘కడప స్టీల్ ప్లాంట్’
X

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బాధ్యతను ఏపీ సర్కారే చేపట్టింది. ఈ మేరకు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి విభజన చట్టంలోనే కడప స్టీల్ ఏర్పాటు అంశం ఉంది. మరి ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఏ మేరకు నిధులు సమకూరుస్తుందో తెలియదు కానీ..ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారు చేసింది. డిసెంబర్‌ 26న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్‌ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ రిజిస్టర్‌ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం.. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్‌ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాంట్ కు అవసరంమైన ఇనుప ఖనిజాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ ఎండీసీ నుంచి పొందటానికి వీలుగా అవగాహన ఒఫ్పందం కుదిరిన విషయం తెలిసిందే.

Next Story
Share it