Telugu Gateway
Andhra Pradesh

మూడేళ్ళలో కడప ఉక్కు ఫ్యాక్టరీ

మూడేళ్ళలో కడప ఉక్కు ఫ్యాక్టరీ
X

ఇది మూడో శంకుస్థాపన. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ సారి ప్రైవేట్ రంగంలో ‘బ్రాహ్మణీ స్టీల్ ’కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ సారి కడప స్టీల్ కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ లెక్కన ఇదో మూడో శంకుస్థాపన. సీఎం జగన్ మాత్రం మూడేళ్లలో కడప ఉక్కును పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద సోమవారం ఉదయం ఆయన కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సభలో మాట్లాడారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమన్నారు. ‘‘జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఎన్నో కలలు కన్నానని తెలిపారు.

జిల్లా అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి, నాన్న వైఎస్ హయాంలో కాస్తో, కూస్తో ముందడుగులు పడ్డాయి. నాన్న చనిపోయాక జిల్లా గురించి, మన పిల్లల గురించి గానీ, వారికి మంచి జరగాలనిగానీ ఎవరు ఆలోచించలేదు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే విషయం తెలిసిన వ్యక్తి, మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ పరిశ్రమకు ముడిసరుకు అందించేందుకు ఎన్‌ఎండీసీ తో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇందుకు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తప్పకుండా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఇది కూడా చేస్తామని చెప్పారు.

ఐదేళ్లు ఎదురు చూసినా న్యాయం జరగలేదు. దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడపతోపాటు రాయలసీమ జిల్లాలకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయి. 2018 నాటికి దేశంలో ఉక్కు పరిశ్రమ సామర్థ్యం కోటి ఆరు లక్షల టన్నులు. జాతీయ విధానం ప్రకారం 2030 నాటికి మన దేశ అవసరాలు తీరాలంటే మూడు కోట్ల టన్నుల సామర్థ్యం అవసరమని అంచనా. ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ రావడం వల్ల రాష్ట్రంతోపాటు దేశానికి మంచి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఈ ఫ్యాక్టరీని కడుతూనే.. మరోవైపు ఇదే విషయమై పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఆగకూడదన్న ఉద్దేశంతోనే మనమే ముందడుగు వేశాం. మధ్యలో ఎవరైనా వస్తే సరి. రాకపోతే ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుంది.

.

Next Story
Share it