ఆనం రాజీకొచ్చారా..ఇక షోకాజ్ ఉండదా?
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉంది. ఏకంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఎవరైనా పార్టీ కట్టుతప్పితే వేటు తప్పదని స్పష్టమైన సంకేతాలు పంపింది. దీనికి ప్రధాన కారణం ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు సిటీ అన్ని రకాల మాఫియాలకు అడ్డాగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏ మాఫియా కావాలంటే ఆ మాఫియా ఉందని అన్నారు. అందుకే సిన్సియర్ అధికారులు తరచూ బదిలీ అవుతున్నారని..ఎవరైనా మంచి వాళ్ళు వచ్చినా ప్రజా ప్రతినిధులమైన తాము ఉండనివ్వం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
సీన్ కట్ చేస్తే ఆనం రామనారాయణరెడ్డి సోమవారం నాడు ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అంతే కాదు..తన సీటు కూడా మార్చాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత తన పక్కన వచ్చి నిలుచుంటే తాను ఎక్కడ మాట్లాడగలనని వ్యంగాస్త్రాలు సంధించారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు అరాచక శక్తులు అంటూ వ్యాఖ్యానించారని..ఈ వ్యాఖ్యలు రికార్డుల నుంచి అయినా తొలగించాలి లేదా..టీడీపీ సభ్యులైన క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.