Telugu Gateway
Andhra Pradesh

అమరావతి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కేసు నిలబడుతుందా?!

అమరావతి ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ కేసు నిలబడుతుందా?!
X

అమరావతి భూములకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం కొత్తగా తేల్చింది ఏమిటి?. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ‘సాక్షి’ పత్రిక ప్రచురించిన పేర్లే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించిన జాబితాలో ఉన్నాయని చెబుతున్నారు. కొత్తగా యాడ్ అయితే ఓ ఐదారు పేర్లు వచ్చాయో ఏమో కానీ మిగతా పేర్లు అన్నీ సంవత్సరాల క్రితం సాక్షి పత్రికల్లో ప్రచురించినవే. మరి ఇప్పుడు కొత్తగా సబ్ కమిటీ తేల్చింది ఏమిటి?. ఈ భూ లావాదేవీలపై సీబీఐ విచారణ కానీ..మరో విచారణ కానీ జరిగితే ఏమి తేలుతుంది?. ముందస్తు సమాచారంతో భూమి కొనుగోలు చేసిన వారిపై చర్యలకు చాన్స్ ఉందా?. అంటే అనుమానమే అని నిపుణులు చెబుతున్నారు. రాజధాని ప్రకటనకు ముందు అయినా..తర్వాత అయినా భూములు కొనుగోలు చేయటం నేరం కాదని చెబుతున్నారు. అయితే బినామీలతో కొనుగోలు చేసిన వారు మాత్రమే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని..అది కూడా వాళ్ళు ఈ భూముల కొనుగోలుకు అవసరమైన డబ్బుల లెక్క చూపించాల్సిందే. అంతే తప్ప..పెద్దగా వాళ్ళకు వచ్చే ఇబ్బందులు కూడా ఏమీ ఉండవని చెబుతున్నారు. ఇది మహా అయితే ఐటి కేసు అవుతుంది తప్ప...మరో దానికి ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కోణంలో ఈ అంశాన్ని వాడుకోవటం తప్ప..భూములు కొనుగోలు చేసిన వారు, ఇతరులపై వీటి ఆధారంగా కేసులు పెట్టడం..అవి చట్టం ముందు నిలవటం జరిగే పనికాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అమరావతిలో ఎవరెవరు భూములు కొనుగోలు చేశారనే అంశం ఎప్పుడో పేర్లతో సహా బహిర్గతం అయింది. ఈ పేర్లను ఎన్నికల సమయంలో వైసీపీ ఉపయోగించుకుంది కూడా. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోనూ అవే పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం సీఆర్ డీఏ పరిధి పెంచినట్లు సబ్ కమిటీ తేల్చింది. ఈ రెండింటికి మధ్య లింక్ ఎస్టాబ్లిష్ చేయటం అంత తేలికకాదని..అదే సమయంలో వీటి ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారిపై చర్యలు అన్నది జరిగే పనికాదని ఓ న్యాయనిపుణుడు అభిప్రాయపడ్డారు. అంతిమంగా జరిగేది ఏమిటంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పటం ప్రజల దృష్టిలో టీడీపీ నేతలను దోషులుగా నిలబెట్టడం మాత్రమే.

Next Story
Share it