Telugu Gateway
Andhra Pradesh

రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజధానిపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

అమరావతిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేయనున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అయినా తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పొచ్చు అని..ఇందులో తప్పు పట్టాల్సింది ఏమి ఉందని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం నాడు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారని వెల్లడించారు. అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారన్నారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయన్నారు. విశాఖలో భూములు కొన్నామని అనడం సరైంది కాదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారన్నారు. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామని తెలిపారు. రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మార్చిలో స్థానిక ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. తెలంగాణ తరహాలో ఇంటింటికి తాగునీరు ఇస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.

అధికార వికేంద్రీకరణ ఉంటేనే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అలా అయితేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారే రాజధాని అంశంపై ఆందోళనలు చేస్తున్నారని.. వాళ్ల ఆస్తులు పోతాయని భయపడుతున్నారని విమర్శించారు. తుళ్లూరులో చంద్రబాబు బినామీలకే ఎక్కువ భూములు ఉన్నాయని విమర్శించారు. అమరావతిలో అవసరమైన మేరకు భూములను ఉంచుకుంటామని.. మిగతా భూములను తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ, సచివాలయం కలిపి 200 ఎకరాల్లోనే ఉన్నాయని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. రాయలసీమలో హైకోర్టు వస్తే ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it