Telugu Gateway
Telangana

మునిసిపల్ ఎన్నికల అఖిలపక్షం గందరగోళం

మునిసిపల్ ఎన్నికల అఖిలపక్షం గందరగోళం
X

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్షం గందరగోళంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీలో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాదోపదవాదాలు సాగాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. రిజర్వేషన్లు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం చరిత్రలో ఇంత వరకూ జరగలేదని కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు విమర్శించారు. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ పై కూడా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అఖిలపక్షానికి హాజరైన కాంగ్రెస్‌ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, నిరంజన్‌రావు ఎన్నికల కమిషనర్‌తో వాదనలకు దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఇష్టప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేశారని, ఎన్నికల కమిషన్‌ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని శశిధర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ నేతల తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్‌తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. దీంతో తాము వాకౌట్‌ చేస్తున్నామంటూ మర్రి శశిధర్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, ఎంఐఎం మినహా.. మిగతా పార్టీలు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశాయని తెలిపారు. అయితే ఈ డిమాండ్లను ఈసీ పట్టించుకోలేదని అన్నారు. షెడ్యూల్‌లో మార్పులు చేసి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరామని, దానిపై ఎన్నికల సంఘం ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు.

Next Story
Share it