Telugu Gateway
Andhra Pradesh

ఒక ప్రాంతం నుంచే పాలన..అన్ని ప్రాంతాల అభివృద్ధి

ఒక ప్రాంతం నుంచే పాలన..అన్ని ప్రాంతాల అభివృద్ధి
X

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికే ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన

జగన్ రెడ్డి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రా? రాష్ట్రం అంతటికీ ముఖ్యమంత్రా?

రాజధాని ఎక్కడో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వండి

విశాఖ భూములపైనే వైసీపీ నేతలకు ప్రేమ

ప్రస్తుతం ఏపీని కుదిపేస్తున్న రాజధాని సమస్యపై జనసేన తన వైఖరిని స్పష్టం చేసింది. ఒక చోట నుంచే పాలన.అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ విధానం అని స్పష్టం చేసింది. రాజు మారినప్పుడల్లా రాజధాని మారిస్తే ... ప్రజలే రాజును మార్చే రోజు దగ్గర్లోనే వస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతిని వద్దనుకొంటే.. విశాఖపట్నానికి మారుస్తారా..? లేక కర్నూలుకు తీసుకెళ్తారా..? అనేది ధైర్యంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. “అమరావతి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని కలలు కన్నవారిలో నేను ఒకడిని. కానీ రాజధాని దినదినం అథోగతి పాలవుతోంది. రాజధానిపై ఈ రోజుకి వైసీపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు. జి.ఎన్.రావు కమిటీ చెప్పింది వెనుకబడిన విజయనగరం ప్రాంతంలో రాజధాని పెట్టమని వైజాగ్ లో కాదు. కమిటీ సిఫార్సునే ప్రభుత్వం అమలు చేయలేదు. జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రా..? లేక కొన్ని ప్రాంతాలకు మాత్రమే ముఖ్యమంత్రా..?. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విషాన్ని వెదజల్లడానికేనా 151 మందిని గెలిపించింది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదు కనుకే రాజధానిగా అమరావతిని అంగీకరిస్తున్నామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ ఆ రోజు ఒప్పుకున్నారు. కనుకే రైతులు భూములు ఇచ్చారు. ఆ రోజే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొస్తే రైతులు భూములు ఇచ్చేవారు కాదు కదా. వ్యక్తులు మారినప్పుడల్లా విధానాలు మార్చడం సబబు కాదు. 27 వేల రైతు కుటుంబాలు, దాదాపు లక్షమంది ప్రజలతో ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తోంది. రైతుతో కన్నీరు పెట్టించిన ప్రభుత్వం మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదు.

గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి కానీ రాజధానినే మార్చేస్తారా..? ప్రభుత్వం ధర్మం తప్పింది. వ్యవస్థలు నడిపించే వ్యక్తులే మాట మార్చితే ఎలా..? కడుపు మండిన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో ఊహించుకోండి. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు వైసీపీ నాయకులు నటిస్తున్నారు. 2018 అక్టోబర్ లో తిత్లీ తుపాన్ వచ్చి వేల ఎకరాల్లో పంట నష్టపోతే ఈ నాయకులు ఎక్కడికి పోయారు. పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత పక్క జిల్లా విజయనగరంలో ఉన్నా కూడా శ్రీకాకుళం రైతులను పరామర్శించడానికి రాలేదు. ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో వేలాది మంది చనిపోతుంటే పట్టించుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఉత్తరాంధ్ర భవిష్యత్తు, వెనుకబాటు తనం అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క పెన్నుపోటుతో ఉత్తరాంధ్రకు చెందిన కొన్ని వర్గాలకు రిజర్వేషన్ తొలగిస్తే జగన్ రెడ్డి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు తమను తమ ప్రాంతానికే బదిలీ చేయాలని వేడుకుంటుంటే ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే సంతోషం కంటే చాలా మందిలో భయం నెలకొంది. కారణం వారి భూములు వారి చేతుల్లో లేవు. ఇప్పుడు సడన్ గా వైజాగ్ పై ప్రేమ రావడానికి కూడా అక్కడ భూములు మీద మమకారం తప్ప వైజాగ్ ప్రజల మీద కాదు.

హైకోర్టును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అయితే అలా మార్చే అధికారం తనకే ఉందన్న భ్రమతో ముఖ్యమంత్రి కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్ గా మారుస్తానని ప్రకటించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమరావతిలో ఏర్పడ్డ హైకోర్టును కర్నూలుకు మారుస్తామని ప్రకటించడం ఆ ప్రాంత ప్రజలను మోసం చేయడమే. నిజంగా రాయలసీమ ప్రాంతంపై ప్రేమ ఉంటే పరిశ్రమలు స్థాపించండి. యువత వలసలు పోకుండా నిరోదించండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు కాదు. వెనక్కి నెట్టబడిన ప్రాంతాలు. ఇప్పటి వరకు ఆ ప్రాంతం నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా ఇప్పటికీ వెనకబడి ఉండటానికి కారణం ఎవరు..?. కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని ఎందుకు రాలేదు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Next Story
Share it