వైసీపీ ఎమ్మెల్యేకు చిక్కులు!
వైసీపీ ఎమ్మెల్యే చిక్కుల్లో పడనున్నారా?.తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఆ దిశగానే సాగుతున్నాయి. వైసీపీకి చెందిన తాడికొండ మహిళా శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించి వివాదం నడుస్తోంది. దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు విచారణ జరగనుంది. శ్రీదేవి రిజర్వుడ్ కేటగిరిలోని ఎస్సీ వర్గానికి చెందుతారా?లేదా అన్నదానిపై విచారణ జరగనుంది.గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఈ అంశంపై విచారణ చేపట్టనున్నారు. రాష్ట్రపతి కార్యాలయానికి ఈ విషయమై ఫిర్యాదు అందగా..ఆయన ఎన్నికల కమిషన్ కు పంపించారు.
అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రదాన అదికారికి వచ్చింది. ఆయన దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గుంటూరు జెసిని కోరారు. ఒక ఇంటర్వ్యూలో తాను దళిత క్రిస్టియన్ ను అని శ్రీదేవి అన్నారని సంతోష్ అనే వ్యక్తి పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఈనెల 26న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. ఎస్సీగా రుజువు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు తీసుకురావాలని అదికారి కోరారు. అయితే ఇలాంటి కేసులు అంత తొందరగా తేలటం అనుమానమే అనే అభిప్రాయం కూడా అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.