Telugu Gateway
Politics

జగన్ పొలిటికల్ ఫార్ములా ఆన్’

జగన్ పొలిటికల్ ఫార్ములా ఆన్’
X

తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. విపక్షాలు ఏదైనా అంశం లేవనెత్తితే వెంటనే ‘పొలిటికల్ ఎటాక్ ప్రారంభించాలని సూచించారు. సర్కారు వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లేలా మంత్రులు చురుగ్గా స్పందించాలని ఆదేశించారు. శనివారం నాడు మంత్రులు రియాక్ట్ అయిన తీరు చూస్తే జగన్ పొలిటికల్ ఫార్ములా అమల్లోకి వచ్చినట్లు కన్పిస్తోంది. జనసేన ఆదివారం నాడు విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు..ఇసుక కొరతపై తలపెట్టిన ‘లాంగ్ మార్చ్ ’ఫై మంత్రులు భారీ ఎత్తున ఎటాక్ చేశారు. ఏకంగా ముగ్గురు మత్రులు రంగంలోకి దిగి జనసేనపై రాజకీయ విమర్శలు చేశారు. ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ లు ఇదే అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని కురసాల కన్నబాబు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని.. కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ పోరాటాలు చేయడం వారికే చెల్లిందని విమర్శించారు. నిజంగా పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

వరదల కారణంగా ఇసుక తీయడంలో ఇబ్బంది తలెత్తిందని.. అందుకే ఇసుక డిమాండ్, సప్లై మధ్య కొంత అంతరం ఏర్పడిందని అన్నారు. ఇసుక కొరత ఏర్పడటంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ కు సంతోషం గా ఉంది. అందుకే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారు. నిజానికి వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏముంది. గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారు కదా. బీజేపీ సొంతంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. లెఫ్ట్ పార్టీలు కూడా పవన్‌తో వేదిక పంచుకోమని స్పష్టం చేశాయి. పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని అన్నారు. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇంతకీ పవన్ కళ్యాణ్ చేస్తోంది లాంగ్‌ మార్చా?... రాంగ్‌ మార్చా? అని ప్రశ్నించారు. ఉనికి కోసమే ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఏ రోజూ చంద్రబాబును పవన్‌ ప్రశ్నించిన దాఖలాలు లేవు. వాళ్లిద్దరూ కుమ్మక్కయ్యారు. చంద్రబాబు, పవన్‌ను సూటిగా అడుగుతున్నా?. విశాఖలో లాంగ్‌ మార్చ్‌ ఎందుకు చేస్తున్నారు?. కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని కోరుతున్నా. రాష్ట్రంలో రైతులు సహా అందరూ సంతోషంగా ఉన్నారు. వారం, పదిరోజుల్లో ఇసుక కొరత తీరుస్తాం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవన్‌ లాంగ్‌ మార్చ్‌ అంటున్నాడని ఆరోపించారు. మరో మంత్రి దర్మాన కృష్ణదాస్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టారు. వైసీపీ మంత్రుల ఎటాక్ చూస్తుంటే ‘‘జగన్ పొలిటికల్ ఫార్ములా’ అమల్లోకి వచ్చినట్లే కన్పిస్తోంది.

Next Story
Share it