Telugu Gateway
Andhra Pradesh

లాంగ్ మార్చ్ పై వైసీపీ ‘ప్యానిక్ రియాక్షన్ రీజనేంటి?’

లాంగ్ మార్చ్ పై వైసీపీ  ‘ప్యానిక్ రియాక్షన్ రీజనేంటి?’
X

ఏపీలో జనసేనకు ఉన్నది ఒక్కే ఒక్క ఎమ్మెల్యే. కానీ వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151. ఎవరూ ఊహించని రీతిలో అప్రతిహత మెజారిటీతో అధికారం దక్కించుకున్న వైసీపీ ‘జనసేన లాంగ్ మార్చ్ ’పై ఎందుకంత ప్యానిక్ గా రియాక్ట్ అవుతోంది? గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ ‘రియాక్షన్’ ఏంటి?. మంత్రులు...ఎమ్మెల్యేలు..పార్టీ నేతలు వరస పెట్టి పవన్ కళ్యాణ్, జనసేనపై మూకుమ్మడి రాజకీయ దాడి చేస్తున్న తీరు ఒకింత విశేషమే. ఓ వైపు అసలు ఏపీలో మీ బలమెంత?. మీకున్న ఎమ్మెల్యేలు ఎంత మంది?. పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కదా? అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ ఎందుకింత దూకుడు చూపిస్తుంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో జనసేన టేకప్ చేసిన ‘ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల’ సమస్యలు వాస్తవమే అని అంగీకరిస్తూనే టార్గెట్ చేస్తుంది. అయితే పవన్ మాటలు ఆయనవి కావు...చంద్రబాబువి అంటూ ఎటాక్ ప్రారంభించింది. జనసేన లాంగ్ మార్చ్ పై ప్రకటన చేసిన దగ్గర నుంచి వైసీపీ ఎటాక్ ప్రారంభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ చేసిన దీక్షల సమయంలో కంటే..జనసేన లాంగ్ మార్చ్ పైనే వైసీపీ ఎక్కువ ఖంగారుపడినట్లు కన్పిస్తోంది.

గతానికి భిన్నంగా లాంగ్ మార్చ్ విషయంలో వైసీపీ ధోరణి కన్పించింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, మల్లాది విష్ణుతోపాటు పలువురు పార్టీ నేతలు కూడా జనసేనను...పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బిజెపి కలసి పోటీచేస్తాయా? లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ అదే జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పొచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ దాదాపు ఏడు శాతం ఓటు బ్యాంకును దక్కించుకుంది. టీడీపీ, జనసేన కలిస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపై ఉంటుంది. జనసేన కారణంగానే టీడీపీ సుమారు 40 నియోజకవర్గాల్లో నష్టపోయిందనే అంచనాలు వెల్లడైన విషయం తెలిసిందే. అదే రెండు పార్టీలు పొత్తుతో సాగితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఇరు పార్టీలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడే ఎన్నికలు ఏమీ లేవు అని..కేవలం తాము ప్రజా సమస్యలపై మాత్రమే అన్ని పార్టీలతో కలసి ముందుకు సాగుదామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. అయితే భవిష్యత్ లో వీళ్ళిద్దరూ కలసి ఈ ప్రభావాన్ని నామమాత్రం చేయటం చేసేందుకు వైసీపీ ఎటాక్ ప్రారంభించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it