Telugu Gateway
Andhra Pradesh

ఎన్టీఆర్ వచ్చి జగన్ ను ఓడించాలని వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారా?

ఎన్టీఆర్ వచ్చి జగన్ ను ఓడించాలని వాళ్ళిద్దరూ కోరుకుంటున్నారా?
X

కొడాలి నాని..వల్లభనేని వంశీల డిమాండ్ ఏంటి?. అసలు వాళ్లిద్దరూ ఏమి కోరుకుంటున్నారు. ఇఫ్పుడు వారు చేస్తున్న విమర్శలు.. చెబుతున్న మాటల్లో అంతిమ లక్ష్యం ఏంటి?. టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ టీడీపీని బుల్డోజర్ లా తొక్కేస్తున్నాడు. లోకేష్ ఉంటే పార్టీ లేవదు. మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీల విమర్శల సారాంశం ఇంచుమించు అదే. మంత్రి కొడాలి నాని సహజంగా టీడీపీ లేవకూడదనే కోరుకోవాలి. బహిరంగంగా వైసీపీకి...ముఖ్యంగా జగన్ కు మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ కోరిక కూడా అదే. ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీ పది కాలాల పాటు బాగుండాలి..బాగున్న దాంట్లో మనమూ ఉండాలి అని కోరుకోవటంలో తప్పేమీ లేదు కూడా. కానీ కోడాలినాని, వల్లభనేని వంశీలు ఇప్పుడు ఆకస్మాత్తుగా పదే పదే జూనియర్ ఎన్టీఆర్ పేరు లేవనెత్తటం వెనక కారణం ఏంటి?. ఎన్టీఆర్ అయితే టీడీపీని ఊపేస్తాడు..లోకేష్ వల్ల కావటంలేదని చెప్పటమా?.

నారా లోకేష్ అయితే జగన్ ను ఓడించలేరు...ఎన్టీఆర్ అయితే ఆ పని తేలిగ్గా చేయగలరని మంత్రి కొడాలి నాని..వల్లభనేనని వంశీలు భావిస్తున్నారా?. నిజానికి అదేమీ కాదు. ఎన్టీఆర్ తో లోకేష్ ను పోల్చాలి. నారా లోకేష్ వల్లే అందరూ పార్టీని వీడుతున్నారు అని చెప్పాలి. సాధ్యమైనంత మేర నారా లోకేష్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి. వీరిద్దరి అసలు ప్లాన్ అదే. దాన్నే ఇఫ్పుడు అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములకు నాయకత్వం ఖచ్చితంగా ప్రధాన అంశమే. దీంతో పాటు ఎన్నో అంశాలు కీలకంగా మారతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వల్లభనేని వంశీ పార్టీ మారటం అనేది పెద్ద నేరమూ కాదు..ఘోరమూ కాదు. ఫిరాయింపుల అంశంపై మాట్లాడటానికి టీడీపీకి కనీస అర్హత కూడా లేదు. వంశీని రాజీనామా చేయమనే అర్హత కూడా టీడీపీకి లేదనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆ పార్టీ ఏమి చేసిందో అందరూ చూశారు. కాకపోతే పార్టీని వీడాలని నిర్ణయించుకున్న వల్లభనేని వంశీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ల మీద చేస్తున్న వ్యక్తిగత విమర్శలు...ఆ భాష చంద్రబాబును ద్వేషించే వారిని కూడా ఆలోచనలో పడేశాలా ఉన్నాయనే చెప్పొచ్చు.

ఒక్క వల్లభనేని వంశీయేకాదు..మంత్రి కొడాలి నాని భాష..బూతులు అయితే మరీ దారుణంగా ఉన్నాయనే చెప్పాలి. ఇలా అంటే టీడీపీ నేతలు మాట్లాడలేదా?. అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. రాజకీయాలు అంటే ఏమైనా బూతుల పోటీలా?. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీ సారధ్య బాధ్యతలు చంద్రబాబు దగ్గర నుంచి నారా లోకేష్ చేతికే వస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఓటమి పాలవటం నారా లోకేష్ కు రాజకీయంగా ఇబ్బంది అయినా..రాబోయే రోజుల్లో టీడీపీలో లోకేష్ ఎంతటి క్రియాశీల పాత్ర పోషిస్తారు..ఏ మేరకు రాణిస్తారు అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it