Telugu Gateway
Andhra Pradesh

మెడిటెక్ జోన్ స్కామ్...జితేంద్రశర్మ బ్యాంకు ఖాతాలు మళ్లీ తెరుచుకుంటాయా?

మెడిటెక్ జోన్ స్కామ్...జితేంద్రశర్మ బ్యాంకు ఖాతాలు మళ్లీ తెరుచుకుంటాయా?
X

ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ (ఎఎంటీజెడ్)లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున గోల్ మాల్ జరిగిందని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక మెడిటెక్ జోన్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు. ఇందులోనూ పలు అక్రమాలు నిగ్గుతేలాయి. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతోపాటు ఈ ప్రాజెక్టు లో కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జితేంద్ర శర్మ పాత్ర కూడా ఉందని గుర్తించారు. అంతే కాదు..జితేంద్ర శర్మ విజిలెన్స్ విచారణకు ఏ మాత్రం సహకరించకపోగా..మెడిటెక్ జోన్ కు సంబంధించిన కీలక ఫైళ్ళను కూడా విజిలెన్స్ అధికారులకు ఇవ్వటానికి నిరాకరించారు. అయినా అందుబాటులో ఉన్న రికార్డులతో విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులోనే పలు అంశాలు బహిర్గతం అయ్యాయి. ఇదంతా ఒకెత్తు అయితే గతంలో మెడిటెక్ జోన్ సీఈవోగా వ్యవహరించిన జితేంద్ర శర్మ పలు అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని ఇదే జగన్మోహన్ రెడ్డి సర్కారు జీవో ఇఛ్చి మరీ ఆయన్ను ప్రాజెక్టు నుంచి బయటకు సాగనంపింది.

కానీ అంతలోనే ఏమైందో తెలియదు మళ్ళీ ఏపీ సర్కారు విచిత్రంగా ఆయన్ను మెడిటెక్ జోన్ మేనేజింగ్ డైరక్టర్, సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే విజిలెన్స్ అధికారులు పది రోజుల క్రితమే జితేంద్రశర్మకు సంబంధించి అన్ని బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే కాదు..సీజ్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాలను ఓ నోట్ రూపంలో వైద్య, ఆరోగ్య శాఖకు అందజేశారు. ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా జితేంద్రశర్మకు మళ్లీ పోస్టింగ్ ఇవ్వటంతో ఇప్పుడు మరి ఆ ఖాతాలు తెరుచుకోనున్నాయా? అన్న అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు అవినీతి నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నాం...ఎక్కడ అవినీతి ఉన్నా సహించమని చెప్పే ప్రభుత్వమే తన చర్యలను తానే ఉల్లంఘించుకుంటూ పోవటం వెనక మతలబు ఏమిటో?.

Next Story
Share it