Telugu Gateway
Andhra Pradesh

రాజేంద్రప్రసాద్ కు వంశీ క్షమాపణ

రాజేంద్రప్రసాద్ కు వంశీ క్షమాపణ
X

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడులేని కొత్త స్థాయికి ఈ విమర్శలు చేరుతున్నాయనే చెప్పాలి. ఓ టీవీ చర్చలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటికి వంశీ శనివారం నాడు క్షమాపణ చెప్పారు. అదే సమయంలో వంశీ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజీనామా కోరుతున్న టీడీపీ నేతలు ఎంతో కీలకమైన రాజ్యసభ సభ్యులు పార్టీ మారితే ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవసరం అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షా, కనీసం జె పీ నడ్డాల నివాసం ముందు అయినా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి తాను కూడా వస్తానని వ్యాఖ్యానించారు. అవసరం అయితే దీనికి అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తానని వ్యాఖ్యానించారు. 42 మంది ఎమ్మెల్యేల ఓట్లతో గెలిచిన రాజ్యసభ సభ్యుల రాజీనామాల ముఖ్యమా?. ఒక ఎమ్మెల్యే రాజీనామా ముఖ్యమా? అని ప్రశ్నించారు. ‘రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు.. నేను కాదనలేదు, చంద్రబాబుకు కూడా కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టింది.. ఆయన కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారా?, రంగులు వేసుకున్నవారు రాజకీయాలకు పనికిరారని ఎన్టీఆర్‌ను బాబు విమర్శించలేదా?,

నా ఒక్కడి విషయంలోనే నైతిక విలువలు కనిపించాయా?’ అని ప్రశ్నించారు. గతంలో మోడీని విమర్శించలేదా?. క్యాసెట్లు నావేనా?. వాళ్ళవి లేవా అని వంశీ ప్రశ్నించారు. ‘చంద్రబాబు నా తండ్రి లాంటి వారు కాళ్లకు దండం పెడితే తప్పేంటి?, కాళ్లకు దండం పెట్టడం వేరు.. కాళ్లు పట్టుకోవడం వేరు, నా వ్యక్తిగత పనులకు కోట్లు ఇచ్చారా?, ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా ఫండ్ ఇస్తుంది, 2014లో అది కూడా ఇవ్వలేదు, రాజేంద్రప్రసాద్‌ కూడా డబ్బు తీసుకున్నారు అనే సరికి బాధపడ్డా, అయ్యప్ప మాల వేసుకొని ఏదేదో చేశానని మాట్లాడుతున్నారు, మాల వేసుకున్న నన్నెందుకు తిట్టాడడని అందరూ అంటున్నారు, టీటీడీ బోర్డు, మెంబర్‌ పదవులు అమ్ముకున్నానా?, వెయ్యి కాళ్ల మండం కూల్చానా, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేశానా?’ అని వంశీ ప్రశ్నించారు. టీడీపీ నాయకులు తయారు చేస్తుందని చెబుతున్నారు?. మరి నారావారిపల్లె సర్పంచ్ పదవి ఎన్నిసార్లు గెలిచారు?. చంద్రబాబునాయుడు చంద్రగిరిలో ఎన్నిసార్లు గెలిచారు?. మరి ‘డై’లు ఉపయోగించి నాయకులను ముద్రించే టీడీపీ ఫ్యాక్టరీలో నారావారాపల్లె, చంద్రగిరిలో ఎందుకు తయారు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఎంతో మంది నాయకులను తయారు చేసిన టీడీపీ మరి ఎందుకు నారా లోకేష్ ను గెలిపించలేకపోయిందని ప్రశ్నించారు. తాను సచ్చో పుచ్చో గన్నవరంలో రెండోసారి కూడా గెలిచాను కదా? అని ప్రశ్నించారు.

Next Story
Share it