Telugu Gateway
Politics

‘మహా’ సస్పెన్స్ ముగిసింది...కొత్త సీఎంగా ఉద్ధవ్

‘మహా’ సస్పెన్స్ ముగిసింది...కొత్త సీఎంగా ఉద్ధవ్
X

మహారాష్ట్రలో రాజకీయ సస్పెన్స్ కు ఇక తెరపడినట్లే. త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య అవగాహన కుదిరింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శనివారం నాడు వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవటంతో చివరకు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. వాస్తవానికి ఎన్నికలకు ముందే కలసి పోటీచేసిన బిజెపి, శివసేనలకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా సీఎం పదవి విషయంలో తలెత్తిన విభేదాలు చివరకు బిజెపిని అధికారానికి దూరం చేశాయి శివసేన మొదటి నుంచి ముఖ్యమంత్రి పీఠం చెరిసగం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీనికి బిజెపి నో చెప్పటంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

దీంతో రాజకీయంగా భిన్నధృవాలైన శివసేన చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. అయితే మూడు పార్టీలు కూడా కొత్త సర్కారు ఐదేళ్ళ పాటు సుస్ధిరంగా ఉండేందుకు అవసరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఒక ఉమ్మడి ఎజెండాతో పాలన సాగించాలని ప్రతిపాదించుకున్నారు. సీఎం పీఠం శివసేనకు దక్కనుండటంతో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎన్సీపీ, కాంగ్రెస్ లకు కేటాయించనున్నారు. శుక్రవారం నాడు ముంబయ్ లో సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మాట్లాడుతూ... ‘మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. మూడు పార‍్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. పార్టీల ఎమ్మెల్యేలు లేఖపై సంతకం చేశారు. మా ఎజెండాపై మరింత చర్చలు జరుపుతాం.’ అని తెలిపారు.

Next Story
Share it