Telugu Gateway
Politics

సీఎం అవుతానని అనుకోలేదు..ఉద్థవ్ ఠాక్రే

సీఎం అవుతానని అనుకోలేదు..ఉద్థవ్ ఠాక్రే
X

మహారాష్ట్ర రాజకీయ మలుపులు ముగిశాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమితో కూడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పుతోపాటు పలు కీలక పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. ముందు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంతోపాటు బిజెపికి అసలు విషయం అర్ధమైపోయింది. వెంటనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన అధినేత ఉద్థవ్ ఠాక్రే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి తరుఫున నేతగా మూడు పార్టీల సభ్యులు (ఎమ్మెల్యేలు) శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకున్నారు. నవంబర్ 28న ముంబైలోని శివాజీ పార్క్‌ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం స్వీకారం చేస్తారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ కూడా ప్రమాణం చేయనున్నారు.

ఠాక్రేకు మద్దతుగా ఎమ్మెల్యేలంతా సంతకాలు పెట్టిన లేఖను గవర్నర్‌ను కలిసి అందజేయనున్నారు. రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణంతో సభ ముగియనుంది. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిన తర్వాత ఉథ్థవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవుతానని తాను అనుకోలేదని అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైతుల కష్టాలు తొలగించేందుకు కృషి చేస్తానని..ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం పంపుతామని తెలిపారు.

Next Story
Share it