టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డబ్బును ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయరాదని నిర్ణయించింది. నగదు మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఫిక్స్ డ్ డిపాజిట్లుగా పెట్టనుంది. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వచ్చే వడ్డీ తక్కువే అయినా సరే ఈ కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. గతంలో ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు పెట్టడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. 1400 కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కానుకల రూపంలో టీటీడీకి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందే విషయం తెలిసిందే.