Telugu Gateway
Telangana

ఆర్టీసీని ఇలా నడపటం కష్టమే!..సర్కారు

ఆర్టీసీని ఇలా నడపటం కష్టమే!..సర్కారు
X

జెఏసీ ప్రకటనపై నిర్ణయం వాయిదా

ఛార్జీలు పెంచితే ప్రజలు ఒప్పుకోరు

మాంద్యం ఎఫెక్ట్..ప్రభుత్వమూ ఆర్టీసీ భారాన్ని భరించలేదు

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో జరిగిన సుదీర్ఘ సమ్మెను విరమించి విధుల్లో చేరటానికి జెఏసీ సిద్ధమైనా సర్కారు మాత్రం దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ ఉన్నందున తుది నిర్ణయం ఈ తీర్పు తర్వాత తీసుకోవాలనే నిర్ణయానికి సర్కారు వచ్చింది. గురువారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన ఆర్టీసీ అంశంపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావనకు వచ్చాయి. అయితే కార్మికులను షరతులతో చేర్చుకుంటారా?. జెఏసీ కోరినట్లు షరతులు ఏమీ లేకుండా చేర్చుకుంటారా? అన్న అంశంపై మాత్రం సర్కారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో పాత లెక్కలపైనే ఫోకస్ పెట్టినట్లు సర్కారు వైఖరి చూస్తే అర్ధం అవుతోంది. ‘ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు 2వేల కోట్ల వరకు ఉన్నాయి.

ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు కావాలి. సిసిఎస్ కు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65-70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులు అన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని ’ సీఎం దగ్గర జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయినట్లు చెబుతున్నారు.

Next Story
Share it