చంద్రబాబు పర్యటన...అమరావతిలో ఉద్రిక్తత
ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం నాడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అమరావతిలో రెండు గ్రూపులు గా తయారు అయి చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారాయి. చంద్రబాబు కాన్వాయ్ పైకి, టీడీపీ నేతలు ఉన్న బస్సుపైకి కొంత మంది రాళ్ళు, చెప్పులు విసిరారు. చంద్రబాబు కాన్వాయ్ ను కూడా కొంత మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతిలో రాజధాని పేరు చెప్పి దళితులను మోసం చేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. మరో వర్గం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టారని విమర్శిస్తోంది. అయితే అధికార వైసీపీ కొంత మందిని చంద్రబాబుకు వ్యతిరేకంగా రంగంలోకి దింపిందని ప్రచారం జరుగుతోంది.
అయితే చంద్రబాబుకు నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు మాత్రం అదేమీలేదని..చంద్రబాబు తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబుకు అసలు అమరావతిలో పర్యటించే నైతిక హక్కు లేదని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేశారని ఆరోపించారు. అమరావతిని అమలు చేస్తే ఏపీ ఆర్ధిక ప్రగతికి ఇది ఎంతో దోహదపడేది అని చంద్రబాబు వాదన. అయితే ఈ వాదనను వైసీపీ తోసిపుచ్చుతోంది. కేవలం దోపిడీకి మార్గంగానే చంద్రబాబు అమరావతిని డిజైన్ చేశారని ఆరోపిస్తోంది. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని కొంత మంది నల్లబ్యానర్లు కట్టి నిరసన వ్యక్తం చేశారు.