Telugu Gateway
Cinema

‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ మూవీ రివ్యూ

‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ మూవీ రివ్యూ
X

సందీప్ కిషన్ కొద్ది కాలం క్రితమే ‘నిను వీడని నీడని నేనే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా ఈ యువ హీరోకు కొంచెం రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. శుక్రవారం నాడు సందీప్ కిషన్, హన్సికా మోత్వానీ జంటగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంతా కర్నూలు కేంద్రంగానే సాగుతుంది. కర్నూలులో వరలక్ష్మి పారిశ్రామికవేత్తగా ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదిస్తుంది. రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆమె మచ్చ లేకుండా మంచి పనులు చేస్తూ ఉంటుంది. ఈ తరుణంలో కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఓ జర్నలిస్ట్ హత్య జరుగుతుంది. అయితే ఈ హత్య వరలక్ష్మి చేయించిందని ఆమె ప్రత్యర్ధి..హత్యారాజకీయాలు..బెదిరింపులకు పాల్పడుతుంటే అయ్యప్పశర్మ హంగామా చేస్తుంటాడు. ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికిస్తే తమకు ఎదురు ఉండదని చూస్తాడు. సందీప్ కిషన్ కర్నూలు కోర్టులో కేసులు రాక..‘రాజీ’లు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. కానీ ఆయన తండ్రి మాత్రం తన కొడుకు తెనాలి మంచి లాయర్ గా సెటిల్ అవ్వాలని ఆశిస్తాడు. అందుకే కొడుకు కు వచ్చే చిల్లరమల్లర కేసులు రాకుండా వేరే లాయర్లకు వెళ్ళేలా చేస్తాడు. జర్నలిస్టు హత్య కేసు నుంచి వరలక్ష్మిని బయటపడేసే బాధ్యతను కర్నూలులో పేరుగాంచిన లాయర్ పాత్ర పోషించిన మురళీశర్మ టేకప్ చేస్తాడు.

కానీ చివరకు ఆమె ప్రత్యర్ధితో చేతులు కలిపి వరలక్ష్మిని శాశ్వతంగా జైలుకు పంపే ఏర్పాట్లు చేస్తాడు. కానీ విషయం తెలిసిన తెనాలి రామకృష్ణ రంగంలోకి దిగి వరలక్ష్మికి అసలు విషయం చెప్పి మురళీశర్మ నుంచి కేసు టేకప్ చేసి వరలక్ష్మిని రక్షిస్తాడు. ఆ తర్వాతే సినిమాలో అసలు ట్విస్ట్ వస్తుంది. హీరోయిన్ హన్సిక కూడా లాయరే. సందీప్ కిషన్, హన్సికల లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోయినా సినిమాలో మాటలు మాత్రం బాగున్నాయి. జర్నలిస్టు హత్య కేసులో వరలక్ష్మికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పాత్ర పోషించిన సత్య క్రిష్ణన్ చేసిన కామెడీ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సినిమాలో ఆమె కామెడీనే హైలెట్ అని చెప్పాలి. సప్తగిరి, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీనుల కామెడీ కూడా ప్రేక్షకులను ఒకింత ఆకట్టుకుంటుంది. హీరో సందీప్ కిషన్ తన లాయర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ వైపు ప్రజలకు మంచి చేస్తున్నట్లు కన్పిస్తూ..మరో వైపు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లోనూ ఆకట్టుకుంటారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారనే చెప్పాలి. ఫస్టాఫ్ కంటే..సెకండాఫ్ లోనే సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉంది.

రేటింగ్. 2.25/5

Next Story
Share it