ఆర్టీసీ సమ్మె...హైకోర్టు ప్రతిపాదనకు సర్కారు నో

ఆర్టీసీ సమ్మె పీఠముడికి సరైన పరిష్కారం చూపేందుకు రాష్ట్ర హైకోర్టు చేసిన మాజీ జడ్జీల కమిటీ సూచనను సర్కారు తిరస్కరించింది. ఆర్టీసీ సమ్మెతో పాటు పలు అనుబంధ అంశాలపై మంగళవారం నాడు విచారణ జరిపిన హైకోర్టు తాము చేసిన సూచనలను అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు స్పందించనందున తాము సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేద్దామనుకుంటున్నామని ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ స్పందన ఏంటో తెలపాలని అడ్వకేట్ జనరల్ కు సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వ స్టాండ్ తెలుసుకుని చెబుతానన్న అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు.
అందుకు అనుగుణంగానే సర్కారు బుధవారం నాడు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయమూర్తుల కమిటీ అవసరం లేదని సర్కారు తన అఫిడవిట్ లో పేర్కొంది. ఆర్టీసీ సమ్మె లేబర్ కోర్టులో ఉన్నందున కమిటీ అవసరం లేదని అందులో తెలిపింది. ఆర్టీసి కార్మికులు ఎవరి ఆదేశాలను పట్టించుకోవటంలేదని ప్రస్తావించారు. ఆర్టీసీ సమ్మెపై లేబర్ కమిషన్ కు చట్టప్రకారం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్మికులు అందరూ చట్టాలకు లోబడి ఉండాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.